గత కొన్ని రోజులుగా టిక్‌టాక్‌లో ట్రెండిగ్‌గా మారిన గబ్బి పెటిటో అదృశ్యం కేసును అమెరికా ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) అధికారులు చేధించారు. బాయ్‌ఫ్రెండ్ చేతిలో ఆమె నరహత్యకు గురైనట్లు వెల్లడించారు. ఫ్లోరిడాకు చెందిన 22 ఏళ్ల యువతి గబ్బి పెటిటో తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రోడ్ ట్రిప్‌కు వెళ్లి.. కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎఫ్‌బీఐ అధికారులు వ్యోమింగ్ సరిహద్దులో లభించిన మానవ అవశేషాలు గబ్బి పెటిటోవి గుర్తించారు.
ఫ్లోరిడాకు చెందిన గబ్బి పెటిటో ఈ ఏడాది ఆగస్టులో తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి వ్యోమింగ్‌లోని గ్రాండ్ టెటాన్ నేషనల్ పార్క్‌కు వెళ్లింది. ఆ తర్వాత సెప్టెంబర్ 1 గబ్బి పెటిటో బాయ్‌ఫ్రెండ్ బ్రియాన్ లాండ్రి మాత్రం ఒంటరిగా ఫ్లోరిడాలోని తన ఇంటికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియ లేదు.గబ్బి గురించి ఆమె బాయ్‌ఫ్రెండ్ లాండ్రీని ఎంతలా ప్రశ్నించినా.. అతడు సమాధానం చెప్పలేదు.
లాండ్రీ సెప్టెంబర్ 1న ఇంటికి తిరిగి రాగా, ఆ తర్వాత పది రోజులకు పెటిటో తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పెటిటో అదృశ్యంపై లాండ్రీ మాట్లాడటానికి నిరాకరించాడు. ఈ క్రమంలో పోలీసులు గబ్బి పెటిటో ఆచూకీ గురించి ఎవరికైనా.. ఏదైనా సమాచారం తెలిస్తే తమకు తెలపాలని లాండ్రీ తోపాటూ, ప్రజలను కూడా విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలో వ్యోమింగ్ సరిహద్దులో లభించిన మానవ అవశేషాలు పెటిటోకు సరిపోయాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న లాండ్రీ గురించి గాలింపు చర్యలు మొదలు పెట్టారు. గబ్బి పెటిటో హత్యకు గల కారణాలు తెలియాలంటే లాండ్రీ పట్టుబడాలి. గబ్బి పెటిటో అదృశ్యం అయిన నాటి నుంచి ఈ వార్త మీడియాలో ప్రముఖంగా ప్రసారం అయ్యింది. టిక్‌టాక్‌లో గబ్బి పెటిటో అనే హ్యాష్‌ట్యాగ్‌తో క్యాంపెయిన్ నడుస్తోంది. ఇప్పటివరకు దీనికి 650 మిలియన్ వ్యూస్ వచ్చాయి.