ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో ఉంది. సాధారణంగా ఎన్నికలప్పుడు ఉండే వాతావరణం ఇప్పుడు నెలకొందనే చెప్పలి. వైసీపీ, టీడీపీ, జనసేనల మధ్య ముక్కోణపు రాజకీయం రాష్ట్రంలో వేడెక్కిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక అంశం తుఫానును తలపిస్తోంది. అధికార, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. టీడీపీ – జనసేన పోటాపోటీగా నిరసన దీక్షలు చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలని చూస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఈరోజు జగన్ పై చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమయింది.
జగన్‌పై జాతీయ పత్రికలో వేసిన కార్టూన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై తన యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇసుక బస్తాలను కాళ్లకు కట్టుకుని నడుస్తున్న జగన్ క్యారికేచర్‌ను పోస్ట్ చేసారు పవన్ కల్యాణ్. 175 అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 151 స్థానాల్లో ప్రజలు గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని తీసివేసి, 50 మంది కార్మికుల ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైసీపీకే దక్కింది.. అంటూ తన వాల్ లో రాసుకున్నాడు. ఇసుక పాలసీ సరిగా లేదంటూ.. భవన నిర్మాణ కార్మికులు పస్తులుంటున్నారని పవన్ ఈమధ్య జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్త్ చేసిన పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.
రెండు వారాల క్రితం పవన్ చేపట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమంలో కూడా పవన్ సీఎం జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఇసుక విషయంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. దీనిపై వైసీపీ నాయకులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.