హైదరాబాద్ లో అనేక ఇండస్ట్రీలకు ఆలవాలమైన జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జీడిమెట్లలోని సుభాష్‌నగర్ ప్రాంతంలో అట్టల ఫ్యాక్టరీలో అర్థరాత్రి ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. మంటలు ఎక్కువగా ఉండటంతో నిమిషాల వ్యవధిలో పక్కనే ఉన్న ఫ్యాన్ల ఫ్యాక్టరీకి వ్యాపించింది. వెంటనే గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు నాలుగు ఫైరింజన్లతో వచ్చి మంటల్ని ఆర్పేశారు. కాని అప్పటికే అట్టల ఫ్యాక్టరీతో పాటూ ఫ్యాన్ల ఫ్యాక్టరీ మొత్తం కాలి బూడిదయ్యింది. ప్రమాదంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకోగా.. భారీగా ఆస్తినష్టం సంభవించిందని తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది అనుమానిస్తున్నారు. అర్థరాత్రి ప్రమాదం జరగడం పెద్దగా శబ్దాలు రావడంతో చుట్టు పక్కల ఇళ్లలో ఉన్న జనాలు భయంతో వణికిపోయారు. ఎదినా బాంబు విస్ఫోటనం జరిగిందా లేదా ఇంకేమైనా జరిగిందా అని అర్థంకాక ఇళ్ళల్లోని వారు బయటకు పరుగులు తీశారు. తర్వాత జరిగిన ప్రమాదం గురించి తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.