దోపిడీ ముఠాకి.. పోలీసులకు మధ్య ఫైరింగ్.. ఎట్టకేలకు అదుపులోకి.

రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఏటీఎం దోపిడీ దొంగలను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు షాక్ తగిలింది. పోలీసులు తమను పట్టుకుందామని చూసి దొంగలు.. ఒక్కసారిగా ఫైరింగ్ మొదలు పెట్టారు. దీంతో  పోలీసులు షాక్ తిని… వెంటనే కౌంటర్ ఫైరింగ్ స్టార్ట్ చేశారు. కాసేపు ఎదురుకాల్పులు కొనసాగిన తర్వాత దోపిడీ ముఠా నాయకుడితో సహా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అల్వార్ పరిధిలోని చవండికల గ్రామానికి చెందిన దోపిడీ దొంగల ముఠా రెండు ఏటీఎంలను దోచుకుంది. కైర్తాల్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ దోపిడీ ఘటనను పోలీసులు సవాల్ గా తీసుకొని దొంగల కోసం వేట ప్రారంభించారు. చవండికల గ్రామంలోని పొలాల్లో దొంగలు ఉన్నారని..తెలుసుకొని పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. దొంగలను అరెస్టు చేసేందుకు స్థావరానికి వెళ్లారు. వెంటనే ఇరువురికి మధ్య ఫైరింగ్ జరగడంతో ఎట్టకేలకు పోలీసులు ఆ ముఠాను పట్టుకొని విచారిస్తున్నారు. దోపిడీ ముఠా నాయకుడు రాహుల్ పల్లా, అతని అనుచరుడు ఫారూఖ్‌కి బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా దొంగల ముఠా నుంచి మూడు దేశీ తుపాకులు, 8 క్యాట్రిడ్జెస్, మూడు ఏటీఎంలు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.