2018 జనవరి 31కి ఓ ప్రత్యేకత ఉంది. 150 ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు అంతరిక్షంలో బ్లూమూన్ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ అరుదైన చంద్రగ్రహణం మొత్తం 77 నిమిషాల పాటు కనువిందు చేయనుంది. సాధారణంగా నెలలో రెండోసారి కనిపించే నిండు చంద్రుడు సంపూర్ణ గ్రహణానికి గురవడాన్ని బ్లూ మూన్ అని పిలుస్తారు. 1866 మార్చి 31న ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కనిపించనున్న బ్లూ మూన్ ను అలస్కా, హవాయి, వాయువ్య కెనడా ప్రజలు గ్రహణం ప్రారంభం నుంచి చివరి దాకా పూర్తిగా వీక్షించవచ్చు.
సంపూర్ణ గ్రహణ సమయంలో చంద్రుడు ఫసిఫిక్ మహాసముద్రం మీద ప్రయాణిస్తుంటాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అటు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా 31వతేదీ బుధవారం తిరుమల శ్రీవారి ఆలయాన్ని దాదాపు పగటిపూటంతా మూసివేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. సాయంత్రం 5.18 నుంచి రాత్రి 8.41వరకు గ్రహణం ఏర్పడనుందని, గ్రహణం ప్రారంభంకావడానికి ఎనిమిది గంటల ముందుగానే ఆలయానికి తాళాలు వేస్తామని, స్వామివారి దర్శనం ఉండదని అధికారులు చెప్పారు. గ్రహణం విడిచిన తర్వాత ఆగమ శాస్త్ర ప్రకారం, ఆలయాన్ని శుద్ధి చేసి పుణ్యాహవచనం తర్వాత రాత్రి 10గంటలనుంచి భక్తులను అనుమతిస్తామని తెలిపారు.