జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరం భారీ వర్షాలకు చిగురుటాకులా వణుకుతోంది. ఏకధాటి వాన ఆ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. భారీ వానకు నగరంలోని పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. గంటలోనే దాదాపు 25 వేలసార్లు మెరుపులు వచ్చాయంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. భారీ వర్షాలకు వస్తున్న వరదతో ఫ్రాంక్‌ఫర్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. రన్‌వేపైకి భారీగా నీరు చేరి విమానాలు తేలియాడుతున్నట్లు కన్పిస్తున్నాయి. ఎయిర్‌పోర్టులోని ఎస్క్‌లేటర్, దుకాణాల్లోకి భారీగా వరద చేరింది.
బుధవారం రాత్రి నుంచి ఇక్కడ ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. జర్మనీ ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయమైన ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్టు వరదల్లో చిక్కుకోవడంతో ఇక్కడ సేవలు నిలిచిపోయాయి. ఇక్కడి నుంచి బయల్దేరే అనేక విమానాలను రద్దు చేశారు. ఎయిర్ పోర్టుకు వచ్చే విమానాలను దారిమళ్లించారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్ పోర్ట్ రన్‌వేపైకి వరద చేరిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.