ఎన్డీయే గూటికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి…

Former Chief Minister of Karnataka joins NDA
Former Chief Minister of Karnataka joins NDA

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఇరుపార్టీల నేతలు కీలక చర్చలు జరిపారు. తాజాగా, గురువారం కూడా జేడీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు కుమారస్వామి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమైనట్లు తెలిసిందే.

అయితే.. ఈ నేపథ్యంలో కన్నడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీయే కూటమిలో జేడీఎస్ పార్టీ చేరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఈరోజు ఢిల్లీలో జేడీఎస్ అగ్రనేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భేటీ అయ్యారు. వీరి సమావేశం ముగియగానే ఎన్డీయేలో చేరినట్టు కుమారస్వామి ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఎన్డీయేలో జేడీఎస్ చేరడంతో కర్ణాటక రాజకీయాలు ఏ విధంగా మారబోతాయో అనే ఆసక్తి నెలకొంది. అయితే సీట్ల షేరింగ్ కు సంబంధించి మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు.

ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా జేపీ నడ్డా స్పందిస్తూ… ఎన్డీయేలో భాగస్వామి కావాలని జేడీఎస్ నిర్ణయించుకోవడం సంతోషకరమని చెప్పారు. వారిని ఎన్డీయే కూటమిలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. న్యూ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా అనే ప్రధాని మోదీ విజన్ ను ఈ చేరిక మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.