కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా స్వైన్‌ఫ్లూతో బాధపడుతోన్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ హయాంలో ఆయన 2001 నుంచి 2004 వరకు రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే, పరిశ్రమలు, రైల్వే, సమాచార శాఖ మంత్రిగానూ పనిచేశారు. 1930 జూన్ 3న కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన జార్జ్ మాథ్యూ ఫెర్నాండెజ్ రాజకీయ నాయకుడిగా కంటే ప్రజాపోరాట యోధుడిగా గుర్తింపు పొందారు. తొలుత జనతా పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న ఫెర్నాండెజ్, అనంతరం 1994లో సమతా పార్టీని ప్రారంభించారు.
అయితే, తర్వాతి కాలంలో దానిని జనతా పార్టీలోనే మరలా విలీనం చేశారు. తొలిసారి 1967లో పార్లమెంటుకు ఎన్నికైన ఆయన 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొరార్జీ దేశాయ్ క్యాబినెట్లో పరిశ్రమల శాఖ బాధ్యతలు నిర్వహించారు. అలాగే 1989 నుంచి 1990 వరకు వీపీ సింగ్ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగానూ కొనసాగారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన జైలుకు కూడా వెళ్లారు. సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి భారత రక్షణ మంత్రి ఫెర్నాండెజ్. 2003 జూన్ 22న యాంటీ గ్రావిటీ సూట్ ధరించి లోహెగావ్ ఎయిర్‌బేస్ నుంచి సుఖోయ్-30ఎంకేఐలో ఆయన ప్రయాణించారు. ఆయన మృతికి సంతాపాలు వేల్లివేత్తుతున్నాయి.