Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత బౌలింగ్ దిగ్గజం అనిల్ కుంబ్లే వ్యవహార శైలి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న సమయంలోనూ, జట్టులో చోటు కోసం పోటీపడాల్సిన సందర్భంలోనూ ఒకేలాంటి ప్రవర్తన కనబర్చిన పరిణితి చెందిన వ్యక్తిత్వం కుంబ్లేది. భారత జట్టుకు ఆడే సమయంలో సహచర ఆటగాళ్లు ఎవ్వరితోనూ కుంబ్లేకు విభేదాలు తలెత్తేవి కావు. కెరీర్ ఆరంభం నుంచి నిలకడగా రాణించిన కుంబ్లే…బౌలింగ్ కు సంబంధించి ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. మేటి స్పిన్నర్ గా జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. అయితే సౌరవ్ గంగూలీ భారత కెప్టెన్ పగ్గాలు చేపట్టిన తరువాత కుంబ్లే పరిస్థితి మారిపోయింది. సీనియర్ గా కెప్టెన్ పదవికి తనతో పోటీగా ఉన్న కుంబ్లేను గంగూలీ చివరకు జట్టులో స్థానం కోసం పోరాడాల్సిన స్థితిలోకి నెట్టేశాడు. మరో స్పిన్నర్ కావాలంటూ హర్భజన్ సింగ్ ను గంగూలీ జట్టులోకి తేవడంతో…కుంబ్లేకు తుదిజట్టులో చోటుదక్కడం కష్టంగా మారింది.
దీంతో కుంబ్లే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ తన స్థానం నిలుపుకునేవాడు. అయితే తాను క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో కూడా కుంబ్లే ఎవరినీ పన్నెత్తు మాట అనలేదు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎలాంటి విమర్శలూ చేయలేదు. హర్భజన్ సింగ్ తో పోటీపడుతూ, ఎప్పటికప్పుడు ఆటలో కొత్త మెళుకువలు నేర్చుకుంటూ…ముందుకు సాగాడు. ఇదే సహనం తర్వాతి రోజుల్లో కుంబ్లేకు టెస్ట్ కెప్టెన్సీని కట్టబెట్టింది. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సమయంలో సహచర ఆటగాళ్లు ఆయన్ను భుజాలపై ఎక్కించుకుని మైదానమంతా కలియతిప్పి దిగ్గజానికి ఘనంగా వీడ్కోలు పలికారు. జట్టులో సాధారణ ఆటగాడిగా ఉన్నప్పుడే కాదు…కెప్టెన్ గా ఉన్నప్పుడు కూడా అందరితో స్నేహభావంగా ఉండి మంచి మనిషిగా తన కెరీర్లో పేరు తెచ్చుకున్నాడు కుంబ్లే. అలాంటి కుంబ్లే భారత క్రికెట్ కోచ్ పదవి చేపట్టినప్పుడు అందరూ సంతోషంగా ఫీలయ్యారు.
సాధారణంగా భారత క్రికెట్లో కోచ్ కు, కెప్టెన్ కు మధ్య విభేదాలు తలెత్తుతుంటాయి. మిగిలిన ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉన్నా..కోచ్, కెప్టెన్ కు మధ్య మాత్రం చాలా విషయాల్లో ఏకాభిప్రాయం కుదరదు. కానీ కుంబ్లేకు అలాంటి పరిస్థితి ఎదురుకాదని, కెప్టెన్ తో సహా ఆటగాళ్లందరూ అతనితో మంచి సంబంధాలు మెయిన్ టెయిన్ చేస్తారని అంతా భావించారు. వాస్తవంలో పరిస్థితి రివర్సయింది. కుంబ్లేలాంటి వ్యక్తితో కెప్టెన్ కోహ్లీకి బేధాభిప్రాయాలు తలెత్తాయి. మిగతా ఆటగాళ్లకు సైతం కుంబ్లే ప్రవర్తన నచ్చలేదని, హెడ్ మాస్టర్ లాగా వ్యవహరిస్తున్నారని ఆటగాళ్లు భావిస్తున్నట్టు మీడియాలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కోచ్ అయిన ఏడాదికే కుంబ్లే ఆ పదవి నుంచి దిగిపోయాడు. కుంబ్లేను కోహ్లీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడనడానికి అతను ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఉదాహరణగా నిలిచింది.
ప్రపంచ మేటి దిగ్గజ క్రికెటర్ల పేర్లు బ్యాగ్రౌండ్ లో ఉండగా…తాను విద్యార్థిలా వారి ముందు కూర్చున్నట్టు కోహ్లీ నెట్ లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఆ జాబితాలో కుంబ్లే పేరు లేదు. దీనిపై నెటిజన్ల నుంచి కోహ్లీ తీవ్ర విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు. అయితే కోచ్ పదవి నుంచి దిగిపోయిన తరువాత కుంబ్లే మాత్రం ఎక్కడా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కోహ్లీని గానీ జట్టులో ఇటర ఆటగాళ్లను గానీ విమర్శిస్తున్నట్టు ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. అయితే ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో కలిసి ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కుంబ్లే తనపై హెడ్ మాస్టర్ అంటూ వచ్చిన విమర్శలను సరదాగా ప్రస్తావించారు. తన తాత పాఠశాలలో హెడ్ మాస్టర్ గా పనిచేశాడని, ఈ పదం తిరిగి తనదగ్గరకు వచ్చిందని, ఇక్కడున్న వాళ్లకు తనేం మాట్లాడుతున్నానో తెలుసు అని కుంబ్లే అనగానే…అక్కడ నవ్వులు విరిశాయి.
ఇంతకుమించి తన కోచ్ పదవిపై కుంబ్లే ఒక్క మాటా మాట్లాడలేదు కానీ..కెరీర్ లో ఎదుర్కొన్న ఎత్తుపల్లాల గురించి మాత్రం ఓ ఉదాహరణను వివరించాడు. తన కెరీర్లో అతిపెద్ద సవాల్ గా నిలిచిన పర్యటన 2003-04 నాటి ఆస్ట్రేలియాతో సిరీసే అని కుంబ్లే ఈ సందర్భంగా చెప్పాడు. ఆ సిరీస్ లో తన కెరీర్ నిర్ణయాత్మక స్థితికి చేరుకుందని, తుదిజట్టులో చోటు కోసం తాను హర్భజన్ సింగ్ తో పోటీపడాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నాడు. అప్పటికే తాను 30వ పడిలో ఉండడంతో తన రిటైర్మెంట్ గురించి చర్చ మొదలైపోయిందని, అలాంటి స్థితిలో అడిలైడ్ టెస్టులో ఆడే అవకాశం వచ్చిందని తెలిపాడు. అప్పుడున్న పరిస్థితుల్లో తానేదైనా కొత్తగా చేయాల్సిన అవసరముందని గుర్తించి టెన్నిస్ బంతితో ఆడే రోజుల్లో ప్రయత్నించిన గూగ్లీని ప్రయోగించానని, ఆటను మెరుగుపర్చుకోడానికి మార్పులు అవసరమని అప్పుడే గ్రహించానని కుంబ్లే తెలిపాడు. కుంబ్లే ప్రయోగం అప్పట్లో క్రికెట్లో తీవ్రచర్చనీయాంశమయింది. గూగ్లీతో కుంబ్లే కెరీర్ తిరిగి గాడిన పడింది.