Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దక్షిణాఫ్రికాలో భారత ఆటగాళ్ల సూపర్ ఫామ్ కొనసాగుతోంది. వన్డేల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా… తొలి టీ20లోనూ అదే ఆట కొనసాగించింది. జొహెన్స్ బర్గ్ లో జరిగిన తొలి టీ 20లో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విజయంలో ధావన్, భువనేశ్వర్ కీలకపాత్ర పోషించారు. ధావన్ విధ్వంసకర బ్యాటింగ్ తో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకు పడ్డాడు. 39 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 79 పరుగులుచేశాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ కూడా రాణించడంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అనంతరం 204 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆరంభంలో ధాటిగా ఆడినప్పటికీ… భువనేశ్వర్ 5 వికెట్లు కూల్చి ఆ జట్టుకు విజయాన్ని దూరం చేశాడు.
భువనేశ్వర్ బౌలింగ్ మాయాజాలానికి దక్షిణాఫ్రికా 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. భువనేశ్వర్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. భారత్ కు విజయాన్నందించిన ధావన్, భువిలపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి నుంచి కోలుకున్న భారత్… గత ఏడాది శ్రీలంకను చిత్తు చేసినట్టు… ఇప్పుడు ఆతిథ్య జట్టు పనిపడుతోందని మహ్మద్ కైఫ్ కామెంట్ చేశాడు. మరో విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలని, బ్రిలియంట్ ఇన్నింగ్ ధావన్, భువి అద్భుత స్పెల్ తో 5 వికెట్లు దక్కించుకున్నాడని వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసించాడు. టీ 20లో ఐదు వికెట్లు తీసిన భువనేశ్వర్ దేశానికి ఒక నిధిలాంటివాడని, ఛాంపియన్ అని గౌరవ్ కపూర్ వ్యాఖ్యానించాడు. టీ 20 సిరీస్ ను గొప్పగా ఆరంభించారని, బ్యాట్ తో ధావన్, బంతితో భువి బాగా రాణించారని వీరేంద్ర సెహ్వాగ్ కొనియాడాడు.