Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభిన్న మతాలకు, కులాలకు, సంప్రదాయాలకు నెలవైన భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. భారతీయులు శ్వాసగా భావించే క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించే జట్టు కూడా ఇలాగే భిన్నత్వంలో ఏకత్వాన్ని తలపిస్తుంది. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు ఇలా…అనేక మతాలకు చెందిన వారికి జట్టులో చోటు దక్కుతుంది. భారత్ క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన దగ్గరనుంచి..జట్టు ఎప్పుడూ ఇలా విభిన్న వ్యక్తుల కలయికతోనే ఉండేది. . నిజానికి ఇలా జాతీయజట్టుల్లో మైనార్టీలకు ప్రాతినిధ్యం దక్కటం ఇతర దేశాల్లో అంతగా కనపడదు. ముస్లిం దేశమైన పాకిస్థాన్ లో చోటు దక్కించుకున్న హిందువులను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. క్రిస్టియన్ మతాన్ని ఆచరించే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్టుల్లో చాలా అరుదుగా మాత్రమే ఇతర మతస్థులకు స్థానం దక్కుతుంది. అందుకే మన జట్టును ప్రపంచంలోని ఏ దేశాలూ వేలెత్తి చూపే ప్రయత్నంచేయవు. ముస్లింలు క్రికెట్ ఆడడం లేదా…?
జట్టులోనూ హిందూ, ముస్లిం, సిక్కు అని మతపరమైన విభేదాలు ఎప్పుడూ తలెత్తవు. సభ్యులంతా కులమతాలతో సంబంధం లేకుండా కలిసి ఉంటారు. అలాంటిది మన క్రికెట్ జట్టుపై ఓ మాజీ ఐఏఎస్ అధికారి మతం కోణంలో విమర్శలు చేయడం కలకలం రేపుతోంది. సంజీవ్ భట్ అనే అధికారి ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో ముస్లింలు లేకపోవడాన్ని తప్పుబడుతున్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లలో ఒక్క ముస్లిం కూడా ఎందుకు లేడు? ముస్లింలు క్రికెట్ ఆడడం మానేశారా…? ఈ విధంగా ఎందుకు జరుగుతోంది అని సంజీవ్ భట్ అనే మాజీ ఐపీఎస్ అధికారి సోషల్ మీడియాలో బీసీసీఐని ప్రశ్నించారు. దీనిపై నెట్ లో తీవ్ర చర్చ జరుగుతోంది. సంజీవ్ భట్ వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబడుతున్నారు.
జట్టు ఎంపికలో సెలక్షన్ కమిటీ మతాన్ని ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోదని, ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగానే వారికి చోటుకు దక్కుతుందని, మాజీ ఐపీఎస్ అధికారికి ఈ విషయం తెలియకపోవడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా సంజీవ్ భట్ విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చాడు. క్రీడల్లోకి కులం, మతం రంగును తీసుకురాకండి అని మండిపడ్డాడు. దేశానికి ఆడే ప్రతి ఆటగాడూ హిందుస్థానీయే అని బదులిచ్చాడు. ఆటగాడు హిందువైనా, ముస్లిం అయినా, సిక్కు అయినా, క్రిస్టియన్ అయినా, మరెవరైనా సరే…అందరూ దేశానికే ఆడతారని, కులమతాలకు అతీతంగా ఆటగాళ్లంతా సోదరభావంతో మెలుగుతారని హర్భజన్ సింగ్ చెప్పాడు. కాగా…న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్ కు, శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టులకు హైదరాబాద్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ స్థానం దక్కించుకోవడం చూస్తే…సంజీవ్ భట్ వ్యాఖ్యలు ఎంత అర్ధరహితమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.