ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ పార్టీలలో చేరికలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు జాతీయ పార్టీలలో కీలక పాత్ర పోషించి ప్రస్తుతం ఏ పార్టీకి అందుబాటులో లేకుండా తటస్త వైఖరి అవలంబిస్తున్న వారి మీద కాన్సంట్రేట్ చేసిన జనసేనాదిపతి ఆ విధంగా చేయడంలో సఫలీకృతం అవుతున్నారు. ఇటీవల కాకినాడ ప్రాంత మాజీ కాంగ్రెస్ మంత్రిని ఆయన కుమారుడిని పార్టీలో చేర్చుకున్న పవన్ ఇప్పుడు సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి హరిరామజోగయ్య కుమారుడని జనసేనలో చేర్చుకున్నారు. ఆయనకు జనసేనాని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన భావజాలానికి ఆకర్షితుడినై ఆ పార్టీలో చేరానని సూర్యప్రకాష్ చెప్పారు.
జనసేనలో చేరిన హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్. pic.twitter.com/WvK5yM3jsi
— JanaSena Party (@JanaSenaParty) August 11, 2018
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో నిన్న సాయంత్రం పవన్ కల్యాణ్ భారీ బహిరంగ సభను నిర్వహించారు. సభ అనంతరం భీమవరంకు తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యంలో పాలకొల్లులో ఉన్న హరిరామజోగయ్య నివాసానికి ఆయన వెళ్లారు. అక్కడ ఆయనతో దాదాపు గంటసేపు సమకాలీన రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలపై పోరాడుతున్న పవన్ కల్యాణ్ ను జోగయ్య మెచ్చుకున్నారు. ఆయన రాసిన ’60 వసంతాల నా రాజకీయ ప్రస్థానం’ పుస్తకాన్ని బహూకరించారు. ఇదే సమయంలో జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ జనసేన పార్టీలో చేరారు.