తెలంగాణ మాజీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు తాజా మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాబోతున్న ఎన్నికల్లో టిక్కెట్ల కోసం రాహుల్ గాంధీ మరియు తెలుగు దేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ల కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనుకాడరు అనే విమర్శలతో పాటు, అయినప్పటికీ తెలంగాణ ప్రజలు వారిని ఆదరించరనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాబోవు ఎన్నికల్లో తెరాస పార్టీ అత్యధిక మెజార్టీ తో విజయం సాధిస్తుందనే పూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే తాము చేసిన ముందస్తు ఎన్నికల వాగ్దానాలు ని నెరవేరుస్తామని తెలిపారు.
ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఆసరా పెన్షన్లని 1,000 రూపాయల నుండి 2,016 రూపాయలకు, మానసిక మరియు శారీరక వికలాంగులకు ఇచ్చే పెన్షన్లను 1,500 రూపాయల నుండి 3,016 లకు పెంచుతామని, వీటితో పాటు నిరుద్యోగులకు 3,016 రూపాయల నిరుద్యోగ భృతిని డిసెంబర్ 12 నుండి అందిస్తామని తెలిపారు. రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించందని, వ్యవసాయ రంగాలకు 9 గంటల విద్యుత్ పంపిణి చేస్తామని 2009 లో తమ ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ఆ వాగ్దానంను నిలుపుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యిందని, కానీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ ని అందించిన మొదటి ప్రభుత్వంగా (దేశంలోనే) తెరాస ఘనత సాధించిందని అన్నారు.
అంతేకాకుండా, తెరాస అధికారంలోకి వచ్చాక, ఎరువులు, విత్తనాలు పొందడంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా నివారించమని, రైతులకు సాగు ఖర్చు కింద సవంత్సరానికి ఎకరాకు 8000 రూపాయల చొప్పున రైతుబంధు పథకం క్రింద ఆర్ధిక సహాయం అందించిన ఘనత తెరాస ప్రభుత్వానిదే అని గుర్తుచేయడంతో పాటు, మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ ఆర్ధిక సహకారాన్ని 10,000 రూపాయలకు పెంచుతామని తెలిపారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం మరియు కాంగ్రెస్ పార్టీలు యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని, తెరాస ప్రభుత్వం యాదాద్రిని మరో తిరుమల గా తీర్చిదిద్దడానికి శాయశక్తులా కృషి చేస్తుందని, ప్రతి సవంత్సరం తిరుమల తరహాలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుందని తెలుపుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెరాస తోనే సాధ్యమని నొక్కి వక్కాణించారు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 1.4 లక్షల ఎకరాలకు నీటి సౌకర్యాన్ని అందిస్తామనే హామీని కేటీఆర్ ఇచ్చారు. పనిలో పనిగా ఎమ్ఎమ్టిఎస్ రైలు సదుపాయాన్ని రాయగిరి వరకు విస్తరిస్తామని కూడా తెలిపారు.