కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కి ఒక్కసారిగా స్వేచ్ఛ దొరికింది. ప్రభుత్వం కాపు రేజర్వేషన్ల మీద ఓ నిర్ణయం తీసుకోనంత కాలం ఆయన ఎక్కడకి వెళ్లాలన్నా పోలీస్ ఆంక్షలు,షరతులు ఉండేవి. అదేమంటే తుని విధ్వంస ఘటన వారికి పెద్ద ఆయుధం. ఆ నేపథ్యంలో ఆయన ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడానికి ప్రయత్నించినప్పుడల్లా పోలీసులు నియంత్రించేవాళ్ళు. కాపు రిజర్వేషన్స్ మీద చంద్రబాబు సర్కార్ ఓ నిర్ణయం తీసుకోగానే ముద్రగడకి ఎక్కడ లేని స్వేచ్ఛ దొరికింది. అందుకే ఇన్నాళ్లుగా పెండింగ్ లో పడ్డ పనులు, పరామర్శలు పూర్తి చేస్తున్నారు.
తాజాగా ఆయన మాజీ ఎంపీ చింతా మోహన్ ని పరామర్శించడానికి తిరుపతి వచ్చి పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని కామెంట్స్ చేశారు. కాపు ఉద్యమానికి పవన్ మద్దతు ఇవ్వనందుకు తన అక్కసు వెళ్లగక్కారు. ఇక చింతా మోహన్ కుటుంబ సభ్యుల్లో ఒకరి మరణం తర్వాత పరామర్శ కోసమే వెళ్లినట్టు ముద్రగడ చెబుతున్నప్పటికీ అంతకు మించి ఏదో జరుగుతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు రెండు రోజుల కిందట చింతా మోహన్ శ్రీవారిని దర్శించుకుని బయటికి వస్తూ మీడియాతో ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి నీతి, నిజాయితీ కలిగిన, డబ్బు మీద ఆసక్తి లేని సీఎం ని ప్రసాదించమని ఏడుకొండల వాడిని కోరినట్టు మోహన్ చెప్పారు. త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని కూడా ఆయన అంచనా వేశారు. ఈ మాటల్ని బట్టి ఏపీ రాజకీయాల కోసం ఏదో కొత్త ప్రయత్నం , ప్రయోగం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో మోహన్ ని ముద్రగడ కలవడం మీద ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.