Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
1993 ముంబై పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్ కు తిరిగి రావాలనుకుంటున్నాడని ఇటీవల వార్తలొస్తున్నాయి. దావూద్ కేంద్రప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాడని, 24 ఏళ్లగా భారత్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న దావూద్ ను స్వదేశానికి తీసుకువచ్చిన ఘనత తమదే అని చెప్పుకోడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే దావూద్ సోదరుడు ఇబ్రహీం కస్కర్ ఈ వార్తలను ఖండించాడు.
ప్రస్తుతం దావూద్ మనసులో ఇండియాకు రావాలన్న ఉద్దేశం లేదని, దావూద్ ను అరెస్ట్ చేయబోమని, ఎటువంటి విచారణా ఉండబోదని భారత్ హామీ ఇచ్చినా… ఆయన ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదని కస్కర్ తెలిపాడు. దీనికి కారణం పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ ఐ అనుమతి లేకపోవడమే అని చెప్పాడు. ఐఎస్ఐకు చెందిన ఎన్నో రహస్యాలు దావూద్ కు తెలుసని, అందుకే పాకిస్థాన్ అతన్ని భారత్ కు వెళ్లనివ్వదని ఇబ్రహీం కస్కర్ తేల్చిచెప్పాడు. కస్కరే కాదు… ముంబై మాజీ పోలీసు అధికారి ఎంఎన్ సింగ్ కూడా తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దావూద్ తన జీవితంలో ఇండియాకు తిరిగి వచ్చే అవకాశాలు లేవని ఆయన స్పష్టంచేశారు.
ప్రస్తుతం దావూద్ పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ ఐ ఆధీనంలో ఉన్నాడని, ఏదైనా పరిస్థితుల్లో దావూద్ భారత్ కు రావాలని అనుకుంటే, ఐఎస్ఐ అతన్ని హతమారుస్తుందని ఆయన వెల్లడించారు. దావూద్ ఇండియాకు వస్తాడన్న ఆలోచన చేయడం కూడా అనవసరమన్నారు. దావూద్ పేరు చెబితే ముంబై ప్రజలు భయపడే రోజులు పోయాయని ఎంఎన్ సింగ్ అభిప్రాయపడ్డారు. 1993 పేలుళ్ల తరువాత… ఏర్పాటయిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు ఎంఎన్ సింగ్ నేతృత్వం వహించారు. ఆయన కేసు దర్యాప్తు చేస్తుండగా… పోలీసు ఉన్నతాధికారులు కొందరికి దావూద్ తో సన్నిహిత సంబంధాలున్న విషయం వెలుగుచూసింది. దీంతో సింగ్ వారిని డిస్మిస్ చేశారు. పోలీస్ డిపార్ట్ మెంట్ కే చెందిన ఉన్నతాధికారులను సింగ్ సస్పెండ్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. సింగ్ ముంబై క్రైమ్ బ్రాంచ్ సంయక్త కమిషనర్ గా, ముంబై పోలీస్ కమిషనర్ గా కూడా విధులు నిర్వర్తించారు.