టీఆర్ఎస్ కు కాకా కొడుకుల షాక్…!

Former Union Minister Son Vinod Join Congress

ముందస్తు ఎన్నికలకు వెళ్ళే విధంగా అసెంబ్లీ రద్దు చేసిన కేసీఆర్ ఆ రోజునే అభ్యర్ధులను ప్రకటించి తలనొప్పి తెచ్చుకున్నారు. కొన్ని సీట్లకు దాదాపు ముగ్గురు నలుగురు పోటీ పడుతుండడంతో ఆయనకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికే టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటూ ఉండగా ఇప్పుడు టీఆర్ఎస్ కు మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి జీ వెంకటస్వామి (కాకా) తనయుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వినోద్, టీఆర్ఎస్ కు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైనట్టు తెలుస్తోంది. ఇటీవల ఆయన ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై, తన చేరికపై చర్చించినట్టు సమాచారం. వీలైతే దసరాలోపు లేదంటే 20వ తేదీన భైంసాలో జరిగే రాహుల్ గాంధీ సభలో ఆయన మూడు రంగుల కండువాను కప్పుకుంటారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

kcr
అయితే ఇప్పుడు టీఆర్ఎస్ లో సీనియర్ నేతగా, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆయన సోదరుడు జీ వివేక్ పరిస్థితి ఏంటన్న కొత్త చర్చ మొదలైంది. ఈ సోదరులు గతంలో ఎప్పుడూ వేర్వేరు పార్టీల్లో లేరు. ఏ నిర్ణయమైనా కలిసే తీసుకునే వివేక్, వినోద్ లు ఈ దఫా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై ఉత్కంఠ నెలకొని ఉంది. 2013, జూన్ 2న తమ తండ్రి వెంకటస్వామి చిరకాల కోరికైన ప్రత్యేక రాష్ట్రం టీఆర్ఎస్ తోనే సాధ్యమైనందున తాము ఆ పార్టీలో చేరుతున్నట్టు వీరిద్దరూ ప్రకటించారు. ఆ తరువాత 2014 లో ఎన్నికలకు ముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పి మాట మార్చారని ఆరోపిస్తూ, తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చారు. పెద్దపల్లి నుంచి ఎంపీగా వివేక్, చెన్నూరు అసెంబ్లీ స్థానానికి వినోద్ పోటీ పడి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత టీఆర్ఎస్ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష’లో భాగంగా 2016లో వీరిద్దరూ తిరిగి టీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత వివేక్ కి ప్రభుత్వ సలహా దారు పదవి ఇచ్చి కూర్చో బెట్టింది టీఆర్ఎస్. కానీ ఇప్పుడు వినోద్ కి చెన్నూరు టికెట్ ఇవ్వకపోవడం వలన ఆయన పార్టీ మారే విషయం దాదాపు ఖరారు అయినట్టే.

anandh