రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి

రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి

కూలిలను తరలిస్తున్న వాహనం అందియూరు కొండల్లో ఆదివారం ఉదయం బొల్తా పడింది. ఓవర్‌ లోడింగ్‌తో వెళ్తున్న ఈ వాహనం అదుపు తప్పి బొల్తా పడటంతో నలుగురు కూలీలు సంఘటనా స్థలంలో మరణించారు. మరో 11 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈరోడ్‌ జిల్లా అందయూరు సమీపంలోని బర్గూర్‌ కొండ మార్గంలో ప్రైవేటు వ్యక్తులకు చెందిన అనేక తోటలు ఉన్నాయి. ఇక్కడ పనిచేసే కూలీలను ప్రతి రోజూ వాహనాల్లో తరలిస్తుంటారు. ఆదివారం ఉదయం తంబురెడ్డి పట్టి గ్రామానికి చెందిన పదిహేను మంది కూలీలలతో టాటా సుమో వాహనంలో బయలు దేరింది. సామర్థ్యానికి మించి ఓవర్‌ లోడింగ్‌తో కొండ మార్గంలో వెళ్తున్న ఈ చిన్న వాహనం మణియాచ్చి పల్లం వద్ద అదుపు తప్పింది. కొండ మీద నుంచి ఫల్టీ కొడుతూ, కిందున్న రోడ్డు మీద అడ్డంగా వచ్చి పడింది.

ఆ వాహనంలో ఉన్న కూలీలు చెల్లా చెదురయ్యారు. దట్టమైన పొదళ్లతో నిండిన ఈ మార్గంలో ఎవరు ఎక్కడ పడ్డారో అన్నది అంతు చిక్కని పరిస్థితి. అటు వైపుగా వచ్చిన వాహన దారులు 108కు సమాచారం ఇచ్చారు. అయితే, కొండ మార్గంలోకి అంబులెన్స్‌ రావడం కష్టతరంగా మారింది. అతి కష్టం మీద అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌ వాహనాలు, పోలీసు వాహనాల్లో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం అందియూరు, బర్గూర్‌ ఆస్పత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఈరోడ్‌లోని పలు ప్రైవేటు ఆస్పత్రులకు గాయపడ్డ వాళ్లను తరలించారు. అయితే, సంఘటనా స్థలంలోనే తంబురెడ్డి పట్టి గ్రామంకు చెందిన దేవరాజ్‌(45), చిక్కన్న(45), తోటప్పి (45), జగన్‌(35)లు మరణించారు. మిగిలిన 11 మంది తీవ్ర చికిత్స సాగుతున్నది. ఈ ప్రమాద సమాచారంతో తంబురెడ్డి పట్టి లో విషాదం నెలకొంది.