ప్రజా గాయకుడు గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. కొద్ది రోజుల క్రితం వామపక్షాల సభలో ఆయన రాజకీయాల మీద ఆసక్తికర కామెంట్స్ చేయడంతో ఆయన రాజకీయ తెరంగ్రేటం కన్ఫాం అయినా ఏ పార్టీ నుండి పోటీ చేస్తారు అనే విషయం సస్పెన్స్ లో ఉండి పోయింది. అయితే ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఆయన కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. ఆరు నెలల కిందటే గద్దర్ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. మార్చిలోనే ఆయన పార్టీని ప్రకటిస్తారని, త్యాగాల తెలంగాణ పేరిట ఆయన పార్టీని ప్రారంభిస్తారని వార్తలు వెలువడ్డాయి. కానీ ఇప్పటి వరకూ గ్రౌండ్ వర్క్ చేసిన ఆయన త్వరలోనే పార్టీ ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం.
‘బహుజన రాజ్యాధికారమే లక్ష్యం’ పేరుతో ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గద్దర్ ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పోరేట్ శక్తుల చేతుల్లో ఓటు బందీ అయిందని వాపోయారు. రాజకీయ నిపుణులతో చర్చించి పార్టీ ఏర్పాటు విషయం చర్చిస్తానన్నారు. సామాన్య ప్రజానీకం, కాలేజీ విద్యార్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటానని ఆయన తెలిపారు. ఆగష్టు నెలాఖరులో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తామని గద్దర్ తెలిపారు. ఈ సభను వేములవాడలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. తనకు ఇప్పటి వరకూ ఓటు హక్కులేదని తక్షణమే ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటానని గద్దర్ చెప్పారు.