Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గాలి జనార్దన్ రెడ్డి, ఒకానొక సమయంలో బీజేపీ మంత్రి, బళ్ళారి ప్రాంతాన్ని తన కనుసైగతో ఏలిన ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కంటే అక్రమ గనుల తవ్వకాల కేసులో జైలుకి వెళ్లినప్పుడే పాపులర్ అయ్యారు. కర్ణాటక మంత్రియినా ఆయనకీ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి సాన్నిహిత్యం ఎక్కువ, ఎంత ఎక్కువ అంటే వైఎస్ జగన్ ని దేవుడిచ్చిన సోడురుడుగా భావించేంత. అవడానికి ఈయన బీజేపీ మంత్రి, కాని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ కి అత్యంత సన్నిహితుల్లో పేరొందిన ఒకరిలో గాలి కూడా ఉన్నారు.
అయితే ఈ జైలు బైలు వగైరా ఇవన్నీ కాంగ్రెస్ వారు ఏలుతున్న రోజుల్లో, తదుపరి కాలంలో బీజేపే అధికారంలోకి రావడం, కొద్ది నెలలకే గాలి బయటకి రావడం, నోట్ల రద్దుతో దేశ ప్రజలంతా ఏటీఎంల్లో డబ్బు దొరక్క అల్లాడుతుంటే.. కూతురు పెళ్లిని వందల కోట్లతో ఘనంగా చేసి టాక్ అఫ్ ది కంట్రీ అయ్యాడు. అయితే ఏ కాస్తో రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి అయినా ఇదంతా గమనిస్తే బీజేపే చలవ వల్లే గాలి బయటకి వచ్చాడనేది కాదనలేని వాస్తవం.
అయితే జైలు వ్యవహారాల వల్ల ఈ ఐదేళ్ళు రాజకీయాలకి గ్యాప్ ఇచ్చిన గాలి, కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన బీజేపీలో మళ్లీ కీలకంగా మారాలని భావిస్తు దాని మేరకు తన అనుచర గణాన్ని సమాయత్తం చేస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా గాలికి ఊహించని షాకిచ్చారు. అదేమిటంటే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న అమిత్‌షాను గాలి జనార్ధన్‌రెడ్డి గురించి ప్రశ్నించగా అతనితో తమకు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అమిత్ షా స్పష్టం చేశారు.
ఈ ప్రకటనతో గాలి జనార్దన్‌రెడ్డి వర్గం డీలా పడిపోయి, దానికి ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి గాలి జనార్దన్‌రెడ్డితో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. కాని ఈ కథనాలపై కుమార స్వామి వివరణ ఇచ్చారు. దావణగెరెలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వేళ ఇటువంటివి సహజమని అయితే తాము చర్చలే జరుపలేదని కుమార స్వామి చెప్పారు.
అయితే ఆయన ఆ విషయాన్ని కొట్టి పారేస్తున్నా, బళ్ళారి ప్రాంతంలోకాస్త పట్టు ఉన్న గాలి, వేరేదైనా పార్టీ నుండి కాని, లేదా ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఏమి జరుగుతుంది అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.