మైనింగ్ కింగ్ అంటేనే గాలి జనార్ధన్ రెడ్డి అన్నంత ఫేమస్ అయిపోయిన గాలి మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం గాలి జనార్ధన్ రెడ్డి పోన్జీ స్కామ్‌లో అరెస్ట్ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరపరచనున్నారు. విచారణ ప్రక్రియలో భాగంగా.. గాలిని తమ కస్టడీకి అప్పగించాలని సీసీబీ పోలీసులు కోరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి నాటకీయ పరిణామాల మధ్య44 తన లాయర్‌ను వెంటబెట్టుకొని శనివారం సీసీబీ కార్యాలయానికి వచ్చారు.
అక్కడ గాలిని పోలీసులు విచారించారు. శనివారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు ఆయన్ను ప్రశ్నించారు. తిరిగి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఈ విచారణ కొనసాగింది. గాలితో పాటూ మరో ముగ్గుర్ని కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.అనంతరం జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. సీసీబీ విచారణలో కూడా ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆయన సరైన సమాధానాలు చెప్పలేదట. అంతేకాదు ఈ విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రూపంలో రికార్డ్ చేశారట. బెంగళూరుకు చెందిన అంబిడెంట్ మార్కెటింగ్ కంపెనీకి చెందిన కేసు విషయంలో ఈడీ అధికారికి గాలి జనార్దన్ రెడ్డి రూ. కోటి లంచం ఎరవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అంబిడెంట్ సంస్థ రూ.500 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు 2014లో వెలుగులోకి వచ్చింది. నాటి నుంచి సీసీబీ, ఈడీ అధికారులు ఆ సంస్థ చైర్మన్ ఫారిద్‌ను విచారిస్తూ వచ్చారు. అయితే.. ఈ కేసు నుంచి ఫరిద్‌ను తప్పించేందుకు గాలి జనార్దన్ రెడ్డి రూ. కోటికి డీల్ చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆయన పోలీసుల ముందుకు రాక ముందు ఆయన నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే సోదాలు నిర్వహించిన పోలీసులకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి.జనార్ధన్ రెడ్డి ఇంట్లో గోడల మధ్యలో రహస్య లాకర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా జనార్ధన్‌రెడ్డి అసిస్టెంట్ అలీఖాన్ ఇంట్లో పేలుడు పదార్థాలు కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో హైద్రాబాద్, బెంగుళూరు, ఢిల్లీలో జనార్థన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
జనార్ధన్ రెడ్డి మిత్రుల ఇళ్లలో కూడ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇంతవరకు గాలి జనార్ధన్ రెడ్డి ఆచూకీ తెలియలేదు. ఆయన హైద్రాబాద్ లో ఉన్నారని సెల్ ఫోన్ సిగ్నల్స్ చూపగా వారు హైదరాబాద్ మీదే ఎక్కువ ద్రుష్టి పెట్టారు. కానీ ఆయనే అనూహ్హ్యంగా వచ్చి పోలీసుల ఎదుట హాజరయ్యారు.ఒక రకంగా గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ కింగ్ గా జనాలకి ఎలా తెలుసో బీజేపీ నేతగా కూడా అలానే తెలుసు. అయితే గాలి జనార్ధన్ రెడ్డి వ్యవహారం వల్ల పార్టీకి మచ్చ పడుతుంది అనుకున్నారో ఏమో కానీ బీజేపీ నేతలు ఈ వ్యవహారంపై భిన్నంగా స్పందిస్తున్నారు. బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప జనార్దన్ రెడ్డికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఒకప్పుడు అమిత్ షా కూడా అదే మాట చెప్పారు. తప్పు ఎవరు చేసినా చట్టం ముందు అందరూ సమానమే అని అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేసుకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలు తప్ప మిగిలిన విషయాలు తనకు తెలీదని, మాతో ఎవరూ ఈ విషయంపై మాట్లాడలేదని యడ్యూరప్ప అన్నారు.
గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో లేరని, అందువలన ఈ విషయంపై పూర్తి వివరాలు తాము సేకరించలేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గాలి ప్రధాన అనుచరుడు, ఎమ్మెల్యే శ్రీరాములు కూడా ఇంచుమించు ఇలాగే స్పందించారు. ఈ విషయం గురించి తనకు తెలియదని, మీడియాలో చూసిన తర్వాతే తెలుసుకున్నానని తెలిపారు.చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరూ చట్టానికి అతీతులు కారని శ్రీరాములు వ్యాఖ్యానించారు.దీంతో ఇప్పుడు బీజేపీ నేతల స్పందనతో గాలి అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీలో గాలి జనార్ధన్ రెడ్డి కీలక నేతగా వ్యవహరించారు. మంత్రిగా కూడా పనిచేసారు. ఇప్పటికి బళ్లారిలో గాలి కుటుంబానికి మంచి పట్టుంది.ఎన్నికల సమయంలో కూడా బీజేపీకి గాలి జనార్ధన్ రెడ్డి ఆర్థికంగా తోడుంటారని అంటుంటారు. ఎన్నికల సమయంలో బీజేపీ వ్యక్తి అయిన గాలి జనార్ధన్ రెడ్డి కర్ణాటకలో ఎన్నికలు, ఉప ఎన్నికలు అయిపోయి ఇలా కేసులో దొరికిపోయి పారిపోతే పార్టీకి మచ్చ వస్తుందని ఇప్పుడు బీజేపీ వ్యక్తి కాకుండా పోయాడా? అంటూ గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ అధిష్టానం చెప్పినదాని ప్రకారమే కర్ణాటక బీజేపీ నేతలు గాలి జనార్ధన్ రెడ్డి విషయంలో ఇలా స్పందిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకదా మరి ఏరు దాటే దాకా పడవ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న…