తెలుగుదేశం పార్టీ తమకు హోదా ఇవ్వని విషయంలో బీజీపీ తో విభేదించి తమ బంధం తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పుడయితే తెలుగుదేశం ఎన్డీయే నుండి బయటకి వచ్చేసింధో అప్పటి నుండి తెలుగుదేశం మీద కక్షతో ఆంధ్రప్రదేశ్ ని మరింత ఇబ్బందులు పెట్టె ప్రయత్నం చేస్తోంది అధికార బీజేపీ. అటువంటి కక్ష సాధింపు చర్యల్లో ఒకటి కడప జిల్లాకి మంజూరు అయిన స్టీల్ ఫ్యాక్టరీ, ఇప్పుడు కేంద్రం అసలు అలాంటి ప్రతి పాదనే మేము చేయలేదని మెలిక పెట్టడంతో తెలుగుదేశం ఇప్పుడు ప్రత్యక్ష పోరుకు సిద్దమయ్యింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఆధ్వర్యంలో ఆ జిల్లా పార్టీ నాయకులతో కలిసి ఆమరణ దీక్ష చేస్తున్నారు. అయితే ఆ స్టీల్ ఫ్యాక్టరీ అంశం మీద గాలి జనార్ధన రెడ్డి స్పందించారు.గతంలో కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీని నిర్మించేందుకు గాలి జనార్దన్ రెడ్డి ప్రయత్నించారు. భారీగా పెట్టుబడి కూడా పెట్టారు.
కానీ ఆ తర్వాత సీబీఐ కేసులు, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడడంతో ఫ్యాక్టరీ నిర్మాణం ఆగిపోయింది. అయితే ఇప్పుడు కడప ఉక్కు కోసం ఉద్యమం జరగుతున్న నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి కర్నాటకలో మీడియాతో మాట్లాడుతూ, బ్రాహ్మణి స్టీల్స్ కోసం దాదాపు రూ.1350 కోట్లు ఖర్చు పెట్టానని, కడపలో స్టీల్ ప్లాంట్ పనులు తనకే అప్పగించాలని కోరారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదంటూ వస్తున్న నివేదికలను కొట్టిపారేశారు. ఎవరూ అవసరం లేదని…. అనుమతి ఇస్తే రెండేళ్లలో తానే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించి చూపిస్తానని చాలెంజ్ చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించేందుకు ముందుకు రావాలన్నారు. ఒకవేళ స్టీల్ ప్లాంట్ పనులు వేరే వాళ్లకు కేటాయిస్తే, తాను పెట్టిన పెట్టుబడిని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుమతిస్తే రెండేళ్లలో ఫ్యాక్టరీ నిర్మించి చూపిస్తానని, అవసరమైతే, చంద్రబాబును కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని, బ్రాహ్మణి స్టీల్స్ కు సంబంధించిన అన్ని వివరాలు అందజేస్తానని చెప్పారు.