Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్రమ మైనింగ్ కేసులో ఇరుక్కుని బళ్లారి వెళ్లే అవకాశం కోల్పోయిన గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో భలే స్కెచ్ వేసాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభకు గండికొట్టి తనకి గాడ్ ఫాదర్ లాంటి యెడ్యూరప్ప ని ఎలాగైనా సీఎం పీఠం ఎక్కించాలని తహతహలాడుతున్నాడు. తనకు తిరిగి బీజేపీ లో గౌరవం దక్కాలంటే ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా ఆ పార్టీ అవసరాలు తీర్చాలని గాలి గట్టిగా నిర్ణయించుకున్నాడు. అయితే తనకు పట్టున్న బళ్లారి కి అడుగు పెట్టే అవకాశం లేకుండా కోర్టు ఆదేశాలు ఉండడంతో గాలి ఇంకో ఐడియా తో ముందుకు వచ్చాడు. అదేమిటంటే… బళ్లారిలోకి అడుగు పెట్టకుండానే అక్కడ రాజకీయాల్లో తన ప్రాబల్యం నిరూపించుకోవడం.
గాలి తన ప్లాన్ అమలు చేయడానికి ముందుగా బళ్లారి, చిత్రదుర్గ జిల్లాల సరిహద్దుల్లోని ఓ గ్రామంలో ఫామ్ హౌస్ ని కొనుగోలు చేసాడు. అక్కడ మకాం వేసి బళ్లారి జిల్లా నేతలతో ఎన్నికల పర్వాన్ని పర్యవేక్షిస్తారట. ఇలా అక్కడకు వెళ్లబోయే ముందు బెంగుళూరు శివార్లలోని ఓ రిసార్ట్ లో తన సన్నిహితులు, ముఖ్య అనుచరులైన 300 మందితో విందు సమావేశం జరిపినట్టు సమాచారం. కర్ణాటకలో బీజేపీ ని గెలిపిస్తే రాజకీయంగా పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకంతోనే గాలి ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా బాగానే వుంది కానీ ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలు అయ్యి, కాంగ్రెస్ గెలిస్తే మాత్రం గాలికి చుక్కలు కనిపించడం ఖాయం.