Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డెంగ్యూ జ్వరానికి చికిత్స పొందుతూ కన్నుమూసిన టీడీపీ దివంగత నేత గాలిముద్దుకృష్ణమ నాయుడు చివరిక్షణాల్లో ఓ వ్యక్తిని చూడాలని తపించిపోయారు. ఆయన్ను పిలిపించాలని కుటుంబసభ్యులను కోరారు. ముద్దుకృష్ణమ కోరిక మేరకు వారు ఆయన్ను పిలిపించారు… కానీ చివరిక్షణంలో విధి వంచించింది. చివరగా ఆయన్ను చూడాలన్న కోరిక నేరవేర్చుకోకుండానే ముద్దుకృష్ణమ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ముద్దుకృష్ణమ చూడాలని అంతగా తపించిపోయిన వ్యక్తి మరెవరో కాదు… ఆయన నమ్మినబంటు చంద్ర.
గడచిన 20ఏళ్లుగా కష్టసుఖాలన్నింటిలోనూ చంద్ర ముద్దుకృష్ణమ వెన్నంటి నడిచారు. వాహన డ్రైవర్ గా, వ్యక్తిగత సహాయకుడిగా, నమ్మినబంటుగా రెండు దశాబ్దాల నుంచి ముద్దుకృష్ణమను కనిపెట్టుకుని ఉన్నారు. గతవారం జ్వరంతో ఉన్న ముద్దుకృష్ణమను రేణిగుంట విమానాశ్రయానికి తీసుకువెళ్లి హైదరాబాద్ విమనాం ఎక్కించింది కూడా చంద్రనే. హైదరాబాద్ వచ్చిన తర్వాత కుటుంబసభ్యులు ఆయన్ను కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే ఆయన పరిస్థితి విషమించింది. తానిక బతకనని ముద్దుకృష్ణమకు అనిపించిందో ఏమో కానీ చంద్రను పిలిపించాలని, చూడాలని ఉందని కుటుంబ సభ్యులతో చెప్పారు. వారు హుటాహుటిన చంద్రను హైదరాబాద్ రప్పించారు. అయితే చంద్ర వచ్చేటప్పటికే ముద్దుకృష్ణమ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆయన్ను చూసిన చంద్ర భోరున విలపించారు. ముద్దుకృష్ణమ మృతదేహం వద్ద అయ్యా… లే అయ్యా… నీకోసం ఎంతమంది వచ్చారో చూడయ్యా అంటూ చంద్ర విలిపిస్తున్న తీరు అందరి హృదయాలను ద్రవింపచేసింది.