Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సార్వత్రిక ఎన్నికలు నిజానికి 2019 ఏప్రిల్, మే లో జరగాలి. కానీ అంతకన్నా 6 నెలల ముందే జరగొచ్చని తెలుస్తోంది. ఇంతకుముందు అన్ని రాష్ట్రాలకు ఒకే దఫా అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు జరపాలని కేంద్రం ఆలోచించింది. అలా చేయాలంటే సార్వత్రిక ఎన్నికలు ఓ ఏడాది ముందు జరపాల్సి ఉంటుంది. పైగా కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ లో భారీ మార్పులు చేయాల్సి ఉంటుంది. దీంతో కేంద్రం కొన్నాళ్లుగా ఈ విషయాన్ని పెద్దగా ప్రస్తావించడం లేదు. అయినప్పటికీ వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఓ 6 నెలలు ముందుగా జరగొచ్చని తెలుస్తోంది. టీడీపీ కి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈ విషయాన్ని స్వయంగా బయటికి చెప్పారు. పొన్నూరు లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో గల్లా చెప్పిన ఈ అంశం హాట్ టాపిక్ అయ్యింది.
ఒకప్పుడు ఒకే ఎన్నికల నినాదాన్ని కేంద్రం బలంగా వినిపిస్తున్నప్పుడు చంద్రబాబు సైతం ఒకటిరెండు సందర్భాల్లో ముందస్తు ఎన్నికల మాట అన్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్ సంబరపడడం , ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకి దించడం తెలిసిందే . అయితే అప్పట్లోనే లోకేష్ ఈ విషయం మీద మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకి అవకాశం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఒకే సారి ఎన్నికల నిర్వహణకు ఇప్పుడున్న మౌలిక సదుపాయాలు, సాధనసంపత్తి సరిపోవని ఈసీ కూడా చెప్పడంతో ఒకే ఎన్నికల నినాదం వెనక్కి పోయింది. అయినా లోకేష్ వాదనకు భిన్నంగా గల్లా ఆరు నెలల ముందే ఎన్నికలు అనడంతో టీడీపీ శ్రేణుల్లోనూ ఆశ్చర్యం కలిగింది. అయితే ఓ ఎంపీ గానే కాకుండా ఓ వాణిజ్యవేత్తగా గల్లా అంచనాల్ని కూడా తేలిగ్గా కొట్టిపారేసే అవకాశం లేదు.