రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు పోరాడి ఓడింది. అయితే, భారీ లక్ష్యాన్ని ముందుంచుకుని కెప్టెన్ ఎంఎస్ ధోని ఏడో స్థానంలో రావడంపై మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ విమర్శలు గుప్పించాడు. భారీ లక్ష్యఛేదనలో ధోనీ ఏడోస్థానంలో బ్యాటింగ్‌కు దిగడం ఏమిటని ప్రశ్నించాడు. ఏడోస్థానంలో వచ్చి చివర్లో మూడు సిక్సర్లు బాదితే జట్టుకు ఏం ఉపయోగమని అన్నాడు.
లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చే వ్యూహాలతో జట్టును ఎలా నడిపిస్తాడని గంభీర్ సందేహం వెలిబుచ్చాడు. ఇదే పని మరో కెప్టెన్ చేసి ఉంటే క్రికెట్ అభిమానులు తీవ్ర విమర్శలు చేసేవారని, ధోని అవడం వల్ల అంతా సైలెంట్ అయిపోయారని చెప్పుకొచ్చాడు. సామ్ కరన్, రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్‌ని బ్యాటింగ్‌కు పంపించడం వెనుక ఉద్దేశమేంటని గంభీర్ ప్రశ్నించాడు.
కాగా, ఐపీఎల్ 13 వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నై జట్టు, రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి చవిచూసింది. జట్టు విజయానికి 38 బంతుల్లో 103 పరుగులు అవసరమైన సమయంలో ధోని బ్యాటింగ్‌కి దిగాడు. అప్పటికే రన్‌రేట్ కొండలా ఉండటంతో ఒత్తిడి పెరిగిపోయింది.
ధోని (17 బంతుల్లో 29 నాటౌట్; 3 సిక్సర్లు) చివరి ఓవర్లో వరుసగా మూడు భారీ సిక్సర్లతో చెలరేగినా అది గెలుపునకు పనికి రాలేదు. అయితే, ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం వెనుక ధోని అసలు విషయం బయటపెట్టాడు. 14 రోజుల క్వారంటైన్ తన సన్నద్ధతపై ప్రభావం చూపించిందని చెప్పాడు. ప్రాక్టిస్‌కు తగినంత సమయం దొరకలేదని పేర్కొన్నాడు. ఇక చైన్నై శిబిరంలో కొందరు ఆటగాళ్లు, సిబ్బంది కోవిడ్ బారినపడటంతో ప్రాక్టిస్ అనుకున్నంతగా సాగలేదు.