కరీంనగర్ టీఆరెస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సోదరుడు గంగుల ప్రభాకర్ ఈ రోజు ఉదయం హఠాన్మరణం పాలయ్యారు. ఈరోజు ఉదయం తన ఇంటి నుండి వాకింగ్ కోసం బయటకు వెళ్ళిన ఆయన మరలా ఇంటికి తిరిగిరాలేదు. వాకింగ్ చేస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడ రోడ్డు మీదే కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను గమనించిన స్థానికులు ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన రేకుర్తి చేరుకున్నారు, సోదరుడిని చూడగానే భోరున విలపిస్తూ ఆయన కుప్ప కూలారు. ఆయన భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుండి ఇంటికి చేర్చనున్నారు. విషయం తెలుసుకున్న కరీంనగర్ టీఆరెస్ శ్రేణులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్తున్నారు. విషయం తెలుసుకున్న పలువురు టీఆరెస్ మంత్రులు ఫోన్ చేసి గంగులను పరామర్శించినట్టు తెలుస్తోంది.