కృష్ణా జిల్లాలో టీడీపీ మరో షాక్ తగిలింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, కృష్ణాజిల్లా విజయ డెయిరీ డైరెక్టర్ దాసరి వెంకట బాలవర్థన్‌రావు టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిసి వైసీపీలో చేరారు. బాలవర్థన్‌రావుకు కండువా కప్పి జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బాలవర్థన్ టీడీపీ వ్యవస్థాప సభ్యుల్లో ఒకరైన ప్రముఖ పారిశ్రామిక వేత్త దాసరి జై రమేష్ సోదరుడు. జై రమేష్ కూడా ఇటీవలే జగన్‌కు మద్దతు పలికారు. టీడీపీలో ఇబ్బందులు పడలేక వైసీపీలో చేరానని పేర్కోన్నారు బాలవర్థన్‌రావు. వైఎస్ జగన్‌ను ఎలాంటి హామీలు కోరలేదని కార్యకర్తల భవిష్యత్ కోసం తాను వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు.
గన్నవరంలో భయానక వాతావరణం ఉందని ఆ వాతావరణాన్ని తొలగించడానికే వైసీపీ కండువా కప్పుకున్నానని అన్నారు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పనిచేసేందుకు సిద్ధమని అన్నారు. బాల వర్థన్ రావు 1994లో గన్నవరం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత ఆయన 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో మళ్లీ ఓటమిపాలైన ఆయన 2009లో విజయం సాధించారు. 2014లో వల్లభనేని వంశీ ఎంట్రీతో బాలవర్థన్‌రావుకు టికెట్ దక్కలేదు. దీంతో పోటీ నుంచి తప్పుకున్నారు. టికెట్ రాకపోయినా టీడీపీలో కొనసాగుతూ కృష్ణాజిల్లా విజయ డెయిరీ డైరెక్టర్‌గా ఉన్నారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇప్పుడు వైసీపీలో చేరారు.