Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విశాఖ భూకుంభకోణం నేపథ్యంలో మంత్రులు గంటా, అయ్యన్న మధ్య రగిలిన చిచ్చు చల్లారుతోందని అనుకునేలోపే ఇంకో మంట రేగింది. నేడు గంటా కుమారుడు రవితేజ నటిస్తున్న జయదేవ్ సినిమా విడుదల అన్న విషయం తెలిసిందే. విశాఖలో ఈ సినిమా పోస్టర్స్ ని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఇంకేముంది… ఇది అయ్యన్న మనుషుల పనే అని కొందరు ప్రచారం మొదలెట్టేశారు. అయితే అంత అగత్యం మాకు లేదని వాదిస్తున్న అయ్యన్న అనుచరులు గంటా వర్గమే పోస్టర్స్ చించుకుని ఆ వివాదంతో కలెక్షన్స్ రాబట్టుకోవాలని చూస్తున్నట్టు కౌంటర్ ఆరోపణలు చేసింది. నిజానికి ఇది చాలా చిన్న విషయం. అయినా దీన్ని రెచ్చగొట్టడం ద్వారా మరోసారి ఇద్దరు మంత్రుల మధ్య మాటల యుద్ధానికి తెర లేపుదామని ప్రత్యర్థి రాజకీయ పార్టీ కార్యకర్తలే ఆ పోస్టర్లు చింపడానికి కారణమని ఇంకో వాదన కూడా వినిపిస్తోంది.
ఒక్క పోస్టర్ చిరిగితే ఇలా మూడు వాదనలు వినిపిస్తున్నాయి. సహజంగా ఇలాంటి గొడవలు పెద్ద హీరోల సినిమాలు పోటాపోటీగా విడుదల అయినప్పుడు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఈ శుక్రవారం రేసులో జయదేవ్ కి పోటీ ఇస్తోంది సంపూర్ణేష్ బాబు హీరోగా చేస్తున్న వైరస్, ఖయ్యుమ్ భాయ్. ఈ మాత్రం పోటీకి ఇలా పోస్టర్స్ చింపే దాకా విషయం వెళ్లిందంటే చూసిన వాళ్ళకే నవ్వు వస్తోంది. ఇక మంత్రుల స్థాయికి ఎదిగిన గంటా, అయ్యన్న ఎలా ఉండాలి?. ఇద్దరు మంత్రులు సంయమనం పాటిస్తే మేలు. లేకుంటే పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు విశాఖ ప్రజలే సరైన తీర్పు ఇస్తారు.
మరిన్ని వార్తలు