గోవిందం ముందు రాబోతున్నాడు

geetha govindam movie release date fixed

‘అర్జున్‌ రెడ్డి’ తర్వాత విజయ్‌ దేవరకొండ నటించే ప్రతి సినిమాపై అంచనాలు భారీగా ఉంటున్నాయి. అంచనాలకు తగ్గట్లుగా మంచి కథలతో ఆయన సినిమాలు కమిట్‌ అవుతూ వస్తున్నాడు. ఇటీవలే ‘మహానటి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయ్‌ ఆంటోనీగా నటించి మెప్పించిన విజయ్‌ దేవరకొండ తాజాగా ట్యాక్సీవాలా చిత్రంతో రెడీ అయ్యాడు. ఇప్పటికే విడుదల కావాల్సిన ట్యాక్సీవాలా చిత్రం విడుదలకు ఏవో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఆ మద్య విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆలస్యం కారణంగా సినిమా విడుదలను వాయిదా వేసినట్లుగా ప్రకటించారు. తాజాగా చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా వారాలు అయితున్నా కూడా ఇంకా విడుదలకు నోచుకోవడం లేదు. ట్యాక్సీవాలా కంటే ముందే విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ‘గీత గోవిందం’ చిత్రం విడుదల అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మెగా బ్యానర్‌ గీతాఆర్ట్స్‌లో తెరకెక్కుతున్న ‘గీత గోవిందం’ చిత్రం ఇటీవలే ఫస్ట్‌లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్‌ దక్కింది. విజయ్‌ దేవరకొండ తప్పకుండా ఈ చిత్రంతో ఆకట్టుకుంటాడనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. పరుశురాం దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. విజయ్‌ దేవరకొండ తాజా పోస్టర్‌ చాలా ఫన్నీగా, ఆకట్టుకునే విధంగా ఉండి సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ట్యాక్సీవాలా చిత్రం కంటే గీత గోవిందం చిత్రం ముందు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. ట్యాక్సీవాలా బిజినెస్‌ ఆశించిన స్థాయిలో కావడం లేదు. అందుకే గీత గోవిందం చిత్రం విడుదలైన తర్వాత సక్సెస్‌ అయితే అప్పుడు మంచి బిజినెస్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు