గిడ్డి ఈశ్వరి.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ! ఎందుకంటే గిరిజనుల సంప్రదాయ గొడ్డళ్ళతో చంద్రబాబు నాయుడిని తలనరుకుతా ! అంటూ సంచలన ప్రకటనలు చేసిన ఆమె తర్వాత అదే చంద్రబాబు గూటికి చేరి ఆయనకు జై కొడుతున్నారు. వస్తే తనను రాజకీయంగా ఎదిగేలా చేసిన జగన్ అంటే ఈశ్వరికి వీరాభిమానం. జగన్ ని ఎంతో సపోర్టు చేశారు. అటు అసెంబ్లీలోనూ ఇటు బయట కూడా టీడీపీని విమర్శించడంలో ముందున్నారు. అలాంటి నేత ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని జగన్‌ను కాదని టీడీపీలోకి చేరిపోయారు. అలాంటి ఆమె మరోసారి కెమెరాల్లో చిక్కుకున్నారు. గతంలో వైసీపీనుంచి టీడీపీలో చేరే సమయంలో పార్టీ నేతలతో ఆమె రహస్య భేటీని గుర్తుతెలియని వ్యక్తులు చిత్రీకరించి బయటపెట్టగా అప్పట్లో ఈ వివాదం పెద్ద దుమారాన్నే సృష్టించింది.
తాజాగా ఎమ్మెల్యే ఈశ్వరి భూ వివాదంలో చిక్కుకున్నారు. వరుసకు మరదలు అయ్యే చింతలవీధి ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మికి, ఆమెకు మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈశ్వరికి విజయలక్ష్మి, కుమ్మరిపుట్టు గ్రామంలో కొంత స్థలాన్నిఇవ్వగా పక్కనే ఉన్న మరో ఫ్లాట్ స్థలాన్ని ఎమ్మెల్యే ఆక్రమించే ప్రయత్నాలు జరుపుతున్నారని కొంతకాలంగా విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన అనుచరులతో వెళ్లిన ఎమ్మెల్యే ఈశ్వరి గొడవకు దిగారు. ఈశ్వరి, విజయలక్ష్మి ల మధ్య మాటామాట గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో ఇద్దరు కిందపడ్డారు. తర్వాత, తనను కొట్టొద్దు అంటూ ఎమ్మెల్యే కేకలు వేయడంతో మిగతావారు విడిపించారు. సోషల్ మీడియాకి ఎక్కిన ఈ దృశ్యాలు ఒక్కరోజులోనే వైరల్ అయ్యాయి.