ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఘోరం ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన హనీట్రాప్ మర్డర్ వంటిది ఇప్పుడు కలకలం రేపుతోంది. కనిపించకుండా పోయిన వ్యక్తి హత్యకు గురైన విషయం ఆరు నెలల తర్వాత బయటకు వచ్చింది. ముమ్మిడివరం మండలం సి.హెచ్ గున్నేపల్లికి చెందిన రామకృష్ణ గత ఏడాది డిసెంబరు 8న కాకినాడ వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. ఆరు నెలలు గడుస్తున్నా ఆయన ఆచూకీ లేకపోవడంతో అతని తల్లి వెంకాయమ్మ ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన పోలీసులు రామకృష్ణ హత్యకు గురైనట్లు వెల్లడించారు.
అయితే గత ఏడాది డిసెంబరు 11న కరప మండలంలోని అరట్లకట్ట-కరకుదురు రహదారిలోని పంట కాలువలో ఓ వ్యక్తి మృతదేహం వెలుగు చూసింది. అప్పట్లో అక్కడ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేశారు. మృతదేహానికి రాయికట్టి ఉండడంతో హత్య చేసి కాలువలో పడేసినట్లు పోలీసులు పసిగట్టారు. అయితే రామకృష్ణ ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు లోతుగా విచారణ చేపట్టడంతో కరపలో హత్యకు గురైన వ్యక్తి ఆయనేనని గుర్తించారు. రామకృష్ణను ఓ యువతి ద్వారా మభ్యపెట్టి కాకినాడ రప్పించి హత్య చేసినట్లు విచారణలో తేలింది. అయితే భూతగాదాల కారణంగానే రామకృష్ణ.. వరుసకు సోదరుడైన శ్రీనివాస ప్రసాద్ ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అమ్మాయిని ఎరగా వేసి రామకృష్ణను ముగ్గులోకి దించాడు. గత ఏడాది డిసెంబర్ 8న అమ్మాయి ద్వారా రామకృష్ణను కాకినాడ రప్పించి దారుణంగా హత్య చేశాడు శ్రీనివాస ప్రసాద్. ఆ తర్వాత రామకృష్ణ మృతదేహాన్ని కరప మండలం అరట్లకట్ట సమీపంలో పంట కాలువలో పడేశారు. భూతగాదాలో ఒక సందర్భంలో శ్రీనివాస ప్రసాద్ ను రామకృష్ణ కొట్టడంతో ఆ అవమానం తట్టుకోలేకనే ఈ హత్య చేసినట్లు స్పష్టమౌతుంది.