తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. భక్తులకు సులభతరంగా ఉండేందుకు నడకదారి భక్తుల లగేజీని టీటీడీ ఉచితంగా తరలిస్తోంది. గతంలో లగేజీ తరలింపు.. తిరిగి అప్పగించడం మాన్యువల్ పద్దతిలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి నిర్వహించామన్నారు.
నడక మార్గంలో భక్తుల లగేజ్ భద్రపరిచే ప్రాంతాల్లో టోకెన్ ఇచ్చే విధానానికి టీటీడీ స్వస్తి పలికింది. అదే స్థానంలో క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. శ్రీవారి భక్తులుకు సులభతరంగా ఉండేందుకు నడకదారి భక్తుల లగేజీని తరలిస్తుంది. మొత్తం 16 ప్రాంతాల్లో 44 కౌంటర్లలో.. 300 మంది సిబ్బందితో ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నామంటోంది టీటీడీ.
వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు
వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు ఆగస్టు 21 నుండి 23వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో ఉత్సవాలు ఆగస్టు 21న సాయంత్రం 5 గంటలకు ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 22వ తేదీన ఉదయం యాగశాల పూజ, ఉదయం 9.30 గంటలకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ, సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం, రాత్రి 8గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు.
ఉదయం యాగశాల పూజ, ఉదయం 7.30 గంటలకు స్నపనతిరుమంజనం ఆగస్టు 23న నిర్వహిస్తారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరుగనుంది. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఈ మూడు రోజుల పాటు టీటీడీ హిందూధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.
శ్రీ ఆమ్నాయాక్షి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్నశ్రీ ఆమ్నాయాక్షి(అవనాక్షి) అమ్మవారి ఆలయంలో ఆగస్టు 22వ తేదీ నుండి సెప్టెంబరు 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 22వ తేదీ మంగళవారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు అమ్మవారికి అభిషేకం, రాత్రి 7 నుండి 8 గంటల వరకు కంకణ ధారణ నిర్వహించనున్నారు. ఆగష్టు 29వ తేదీ ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు అభిషేకం, సెప్టెంబరు 5వ తేదీన ఉదయం 7 నుండి 9 గంటల వరకు అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
సెప్టెంబరు 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవం, సెప్టెంబరు 7వ తేదీ సాయత్రం 6 గంటల వరకు కీలాగారం గ్రామంలో శ్రీ ఆమ్నాయాక్షి అమ్మవారు ఊరేగి గ్రామస్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. సెప్టెంబరు 8వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.