ప్రతికూలతపై గూగుల్‌ కౌంటర్‌ రియాక్షన్‌

ప్రతికూలతపై గూగుల్‌ కౌంటర్‌ రియాక్షన్‌

యాప్‌ మార్కెట్లో‌ భారత్‌ నుంచి ఎదురైన ప్రతికూలతపై గూగుల్‌ కౌంటర్‌ రియాక్షన్‌ ఇచ్చింది. తమకి వ్యతిరేకంగా ఆరోపణలతో కూడిన కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) నివేదిక బయటకు రావడంపై గూగుల్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతోపాటు ముందు ముందు తమ హక్కులకు భంగం వాటిల్లకుండా పరిరక్షించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

యాప్‌ మార్కెటింగ్‌లో ఇతరులకు స్థానం ఇవ్వకపోవడం, డివైజ్‌ తయారీదారులపై ఒత్తిడి లాంటి అలియన్స్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఇండియా ఫౌండేషన్‌(ADIF) ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సీసీఐ రెండేళ్లుగా దర్యాప్తు నిర్వహించింది. ఈ మేరకు సీసీఐ దర్యాప్తు విభాగం ‘ డైరెక్టర్‌ జనరల్‌’ గూగుల్‌పై వెల్లువెత్తిన ఆరోపణల్ని నిర్ధారించింది కూడా. అయితే అక్కడితో ఆగకుండా ‘గూగుల్‌ ఆండ్రాయిడ్‌ వ్యవహారాల్లో అనైతికంగా ప్రవర్తించిందని, వ్యాపార సూత్రాల్ని విస్మరించింద’ని పేర్కొంటూ పలు అంశాలతో కూడిన నివేదికను లీక్‌ చేసింది. దీంతో గూగుల్‌ ఘాటుగా ప్రతిస్పందించింది.అయితే తమకు వ్యతిరేకంగా సీసీఐ దర్యాప్తు విభాగం ‘డీజీ’ వ్యవహరించడంపై గూగుల్‌ రంగంలోకి దిగింది.

గురువారం ఢిల్లీ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. గోప్యంగా ఉంచాల్సిన నివేదికను బయటపెట్టడం పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక మీదట దర్యాప్తునకు సంబంధించిన వివరాలేవీ బయటకు రాకుండా సీసీఐ దర్యాప్తు విభాగాన్ని నిలువరించాలని హైకోర్టును అభ్యర్థించింది గూగుల్‌. ప్రభుత్వ విభాగాల గోప్యపు నివేదికలు బయటపెట్టడం.. అవతలి వ్యక్తుల ప్రాథమిక హక్కుల్ని భంగపరచడమే అవుతుందని గూగుల్‌ వాదిస్తోంది. మరోవైపు డీజీ దర్యాప్తులోని అంశాలు కేవలం ఆరోపణలేనని, అవి తుదితీర్పుపై ప్రభావం చూపించకపోవచ్చనే గూగుల్‌ చెబుతోంది.

నివేదికగానీ, నోటీసులుగానీ తమదాకా రాలేదని, అందుకే ఈ అంశంపై సమీక్ష దిశగా కూడా ఆలోచన చేయట్లేదని పేర్కొంది.డివైజ్‌ తయారీదారుల సామర్థ్యం తగ్గించడంతో పాటు, ప్రత్యామ్నాయ వెర్షన్‌లను(ఫోర్క్స్‌) బలవంతంగా వాళ్లపై రుద్దిందనేది సీసీఐ(డీజీ విభాగం) తన దర్యాప్తులో గుర్తించింది. తాజాగా అనధికారికంగా ఒక నివేదికను విడుదల చేసిన సీసీఐ.. గూగుల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.