సీఐ గోరంట్ల మాధవ్ పేరు కొద్ది రోజుల క్రితం వార్తల్లో మారుమోగిపోయింది. ఏకంగా అధికార పార్టీ ఎంపీకే మీసం మెలేసి వార్నింగ్ ఇవ్వడంతో ఈయన పేరు వార్తల్లో బాగా వినిపించింది. అనంతపురం జిల్లాలో ప్రబోధానంద స్వామి గొడవలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో సీఐ మాధవ్ తెరపైకి వచ్చారు. పోలీసులపై జేసీ చేసిన వ్యాఖ్యలని మాధవ్ తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసుల జోలికి వస్తే నాలుక కోస్తానంటూ మీసం మెలేసి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.అయితే ఈమధ్య గోరంట్ల మాధవ్ త్వరలో వైసీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎంపీగా పోటీచేయనున్నారు అంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. వాటికి ఊతం ఇస్తూ ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అలాగే అందరూ ఊహించినట్లుగానే ఈరోజు మాధవ్ వైసీపీలో చేరారు. సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసిన మాధవ్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించింది మొదలు ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఉద్యోగాన్ని వదిలి వైసిపి లో చేరిన మాధవ్ కు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందా లేదా అనే చర్చ మొదలైంది. రాజ కీయంగా మంచి భవిష్యత్ కల్పిస్తామనే పార్టీ నేతల హామీ మేరకు ఆయన వైసిపిలో చేరినట్లు చెబుతున్నారు. సొంత జిల్లా అయిన అనంతపురం నుండి ఆయనకు సీటు కేటాయించాలని జిల్లా నేతలు కోరుతున్నారు. అయితే, ఇప్పటికే అనంత లో ప్రతీ నియోజకవర్గంలో సమన్వకర్తలు ఉన్నారు. ఎవరిని మార్చే పరిస్థితి లేదు. ఇక, హిందూపూర్, కదిరి వంటి నియోజకవర్గాల్లో పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. దీంతో మాధవ్ విషయంలో జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుం టారనేది ఆసక్తి కరంగా మారింది. అయితే మాధవ్ మాత్రం జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలకు ఆకర్శితులై పార్టీలో చేరినట్లు ప్రకటించారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.