Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధానమంత్రితో సమావేశమై తెలుగు రాష్ట్రాల పరిస్థితిపై చర్చించిన మరుసటి రోజు గవర్నర్ నరసింహన్ పట్టు వీడారు. ఆంధ్రప్రదేశ్ నాలా బిల్లుకు ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే నాలా బిల్లు ను ఇటీవల ముగిసినఏపీ శాసన సభ సమావేశాల్లో ఆమోదించారు. వ్యవసాయ భూమి చట్టానికి సవరణలు చేస్తూ ఈ బిల్లు ఆమోదించారు. అనంతరం బిల్లును ఏపీ ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. అయితే దీనిపై రాజముద్ర వేసేందుకు గవర్నర్ నరసింహన్ నిరాకరించారు.
ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం పంపిన ఇలాంటి బిల్లుకే ఆయన ఆమోద ముద్ర వేయడం, ఏపీ బిల్లును నిరాకరించడంతో ఆంధ్రప్రదేశ్ నేతలు ఆగ్రహానికి గురయ్యారు. గవర్నర్, ఏపీ ప్రభుత్వానికి మధ్య సంవాదం కూడా చోటుచేసుకుంది. విష్ణుకుమార్ రాజు లాంటి బీజేపీ నేతలు బడ్జెట్ సమావేశాల్లోపు నరసింహన్ ను తొలగించి కొత్త గవర్నర్ ను నియమించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే బిల్లుపై కొన్ని అభ్యంతరాలు లేవనెత్తిన గవర్నర్ వాటికి బదులివ్వాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. దీంతో గవర్నర్ అభ్యంతరాలకు వివరణ ఇవ్వాలని రెవెన్యూ శాఖను సీఎం ఆదేశించారు. ఆ శాఖ ఇచ్చిన వివరణతో సంతృప్తిచెందిన నరసింహన్ నాలా బిల్లుకు ఆమోద ముద్రవేశారు.