ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఎన్నో హామీలను ఇచ్చిన అప్పటి ప్రభుత్వం, ఆపై అధికారంలో ఉన్న ప్రభుత్వం వాటిని నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యిందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ 14వ శాసన సభ చివరి సమావేశాలు ఈరోజు ప్రారంభంకాగా, ఉభయ సభలను ఉద్దేశించి నరసింహన్ ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా, ఏపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను, ప్రజాపయోగ కార్యక్రమాలను చేపట్టిందని ఆయన అన్నారు. రాష్ట్రానికి అత్యంత అన్యాయం జరిగినా అభివృద్ధి పథంలో పయనిస్తున్నారని, గడచిన నాలుగున్నరేళ్ల వ్యవధిలో వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధిపై 10 శ్వేతపత్రాలను ఇటీవలే విడుదల చేశారని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ మొత్తాన్ని రూ. 1000 నుంచి రూ. 2 వేలకు పెంచారని, త్రీ వీలర్ వాహనాలకు పన్ను మినహాయింపులు ఇచ్చారని నరసింహన్ తెలిపారు.
వ్యవసాయ రంగంలో వాడుతున్న యంత్ర పరికరాలకు కూడా ఇవే మినహాయింపులను అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రం అగ్రవర్ణ పేదలకు ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లను ఒక్క కాపులకే ఇవ్వాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. స్వయం సహాయక బృంద సభ్యులకు రూ. 10 వేలు కూడా మంజూరు చేశారని అన్నారు. రాష్ట్ర విభజన అసంబద్ధంగా జరిగిందని, కడపకు మంజూరు చేస్తామన్న ఉక్కు కర్మాగారాన్ని, కేంద్ర సహకారం లేకుండానే ఏపీ ప్రభుత్వం చేపట్టిందని, దీని వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు దగ్గర కానున్నాయని గవర్నర్ వ్యాఖ్యానించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని నగరం అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోందని, కేంద్రం సకాలంలో నిధులను అందించకున్నా, ప్రభుత్వం నిర్మాణాలను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోందని తెలిపారు. జాతీయ సగటుతో పోలిస్తే, రాష్ట్ర వృద్ధి అధికంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే కేంద్రానికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించే గవర్నర్ ఈ ప్రసంగాన్ని వినిపించడం ఆశ్చర్యంగా మారింది.