ఈ మధ్య కాలంలో ఒక ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్ తింటూన్న దృశ్యం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ డెలివరీ బాయ్స్ ఇంతే అన్నట్టు అందరినీ తిట్టి పోశారు, నిజానికి కొన్ని చోట్ల డెలివరీ బాయ్స్ నేరాలకు పాల్పడిన సందర్భాలు, ఒంటరిగా ఉండే మహిళలను లైంగికంగా వేధించిన ఘటనలు కూడా జరిగాయి. ఐతే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన బాయ్‌ను అమ్మాయిలు టార్గెట్ చేశారు. గదిలోకి తీసుకెళ్లి చితక్కొట్టారు. అనంతరం డబ్బులు లాక్కొని గెంటేశారు. యూఏఈలోని షార్జాలో ఈ ఘటన జరిగింది. షార్జాలో పనిచేస్తున్న ఒ ఫుడ్ డెలివరీ బాయ్ పార్సిల్ ఇచ్చేందుకు ఓ ఫ్లాట్ కు వెళ్లాడు. ఓ యువతి బయటకు వచ్చి ఫుడ్ ప్యాకెట్ తీసుకొని లోపలికి వెళ్లిపోయింది. డబ్బులు ఇవ్వకుండానే ఆమె వెళ్లిపోవడంతో పదే పదే కాలింగ్ బెల్ కొట్టాడు డెలివరీ బాయ్. ఐతే అక్కడ అతడికి ఊహించని అనుభవం ఎదురయింది. లోపలి నుంచి ఒక్కరు కాదు..ఐదారు మంది యువతులు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. లోపలికి లాక్కొని వెళ్లి లైట్స్ ఆఫ్ చేసి..కత్తితో బెదిరించారు. అనంతరం ఫోన్, 800 దిర్హామ్‌లు లాక్కొని బయటకు గెంటేశారు. యువతుల చేతిలో నిండా మోసపోయిన బాధితుడు..నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదుచేశాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఘటనపై నమోదు చేసుకున్న పోలీసులు సదరు యువతితో పాటు ఆమె ఫ్రెండ్స్‌ని కూడా అరెస్ట్ చేశారు. పోలీసులు ముందు తప్పును అంగీకరించిన యువతి..అతడి డబ్బులు, ఫోన్ తిరిగి ఇచ్చేస్తామని చెప్పింది.