బాబు కుర్చీ లాగడమే వాళ్ళ జీవిత లక్ష్యం !

రాజకీయాల్లో పరిణామాలు మనసు కన్నా వేగంగా పరిగెత్తే రోజులు ఇవి. అందుకే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పోరాడి అదే ప్రాతిపదికగా రాజకీయ అస్తిత్వం ఏర్పర్చుకున్న వామపక్షాలు ఇప్పుడు అదే పార్టీతో అంటకాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతకన్నా చిత్రం ఇప్పుడు బీజేపీ ని బద్ధశత్రువుగా చూస్తున్న ఇవే వామపక్షాలు ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్ హయాంలో కలిసి పని చేశాయి. దేశ రాజకీయాలకు మూలబిందువులు అయిన ప్రధాన జాతీయ పార్టీల వైఖరే ఇలా ఉంటే ఇక రాజకీయాల్లో జెండాలు , గొడుగులు మార్చే నేతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ఇంత ద్రవాత్మకంగా వున్న నేటి రాజకీయాల్లో కొందరు మాత్రం ఒక నిర్దిష్ట లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఆ లక్ష్యం నిర్మాణాత్మకం అయితే పర్లేదు. కేవలం తమకు వ్యక్తిగతంగా నష్టం చేశారనే , అనుకున్న ప్రాధాన్యం ఇవ్వలేదనే అభిప్రాయంతో సదరు మనిషిని గద్దె నుంచి దించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. వీరికి అంతకు మించి పనేమీ లేదు. ఇలా బాబు ఎప్పుడు గద్దె ఎక్కినా కిందకు లాగడమే పనిచేసే జాబితా చాంతాడు అంత వుంది. అందులో రాజకీయ నేతలు మాత్రమే ఉంటే సరేలే అనుకోవచ్చు. మేధావులుగా సమాజం పెద్ద పీట వేసిన వారు సైతం ఇదే బాటలో నడవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయినా అది కళ్ళ ముందు నిలిచి వున్న వాస్తవం.

లక్ష్మీపార్వతి , పురందరేశ్వరి , దగ్గుబాటి వెంకటేశ్వరరావు , యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ , వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఉండవల్లి అరుణ్ కుమార్ , యలమంచిలి శివాజీ …ఇదంతా పాత లిస్ట్ అయితే ఈ మధ్య కొత్త జాబితా తయారైంది. ఇందులో ఐవైఆర్ కృష్ణారావు , రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డి , రోజా.కన్నా వీరిలో ఏ ఒక్కరు చంద్రబాబుని తిట్టకుండా ప్రెస్ మీట్ ముగించి వేస్తే ఆశ్చర్యపోతాం. అంతగా బాబుని అలవాటు అయిపోయింది వాళ్లకి. సీఎం కుర్చీకి పోటీ పడుతున్న జగన్ , పవన్ లు చంద్రబాబుని ఈ స్థాయిలో ఎటాక్ చేశారంటే దానికో అర్ధం ఉంటుంది. పై జాబితాలో వున్న ఏ ఒక్కరిని చంద్రబాబు రాజకీయ ప్రత్యర్ధులు అనడానికి వీల్లేదు. ఎందుకంటే..వాళ్ళు ఏ దశలోనూ ఆ స్థాయిలో లేరు. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. వీళ్ళ పని మహాభారత యుద్ధంలో అభిమన్యుడు మరణానికి కారణం అయిన సై౦ధవుడు పాత్ర పోషించే వాళ్లే.

అయితే చిత్రం ఏమిటంటే పైకి వీళ్లంతా ప్రజాక్షేమం కోసమే చంద్రబాబు మీద యుద్ధం చేస్తున్నట్టు చెప్పుకుంటారు. ఆ విషయంలో ఒక్క లక్ష్మీపార్వతి మినహాయింపు. చంద్రబాబుని గద్దె దించడమే తన లక్ష్యం అని ఆమె బహిరంగంగానే ప్రకటిస్తారు. మిగిలినవాళ్లు మాత్రం ప్రజాక్షేమం ముసుగు వేసుకుంటారు. ఆ మాటల్లో నిజం వుంది నమ్ముదాం అంటే ఒక్క చంద్రబాబు తప్ప ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకెవరూ ఏ తప్పు చేయనట్టు మౌనం దాలుస్తారు. వై.ఎస్ , జగన్ సహా వివిధ దశల్లో జరిగిన అవినీతి, వైఫల్యాల గురించి ఒక్కరు కూడా మాట్లాడిన దాఖలాలు కనిపించవు. అక్కడ మౌనం ,ఇక్కడ యుద్ధం ఏంటి అని ప్రశ్నిస్తే మౌనం మినహా సమాధానం ఉండదు.

నిజంగా వీరి పోరాటంలో నిజాయితీ ఉంటే మిగిలిన సందర్భాల్లో కూడా అలాగే స్పందించే వాళ్ళు . అలా వాళ్ళు స్పందించి ఉంటే జనం కూడా నమ్మే వాళ్ళు. జనం తమని నమ్మడం లేదని వాళ్లకు కూడా తెలుసు. అయినా ఈర్ష్య, ద్వేషం ఆపుకోలేని బలహీనత. పదేపదే వైఫల్యాలు ఎదురు అవుతుంటే వయసుకు తగ్గట్టు వైరాగ్యం రావాల్సింది పోయి ద్వేషం పెంచుకుంటూ పోతున్న వీళ్ళని చూసి జాలిపడడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఏదైనా నిర్మాణాత్మక పనులని లక్ష్యంగా పెట్టుకుంటే పనులు అవుతాయి. కాకపోయినా ఓ మంచి పనికి ప్రయత్నం చేసామన్న సంతృప్తి అయినా మిగులుతుంది. కానీ కేవలం బాబు ఓడిపోతే అంతా బాగుంటుందని , లేకుంటే అంతా అపసవ్యం అని భావించే వీళ్ళ దృష్టి లోపాన్ని చూసి ఎవరైనా ఏమి మాట్లాడగలరు? ఈ వాదన తప్పని నిరూపించదలుచుకుంటే పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు…తమకు తెలిసిన తప్పులు అన్నిటి గురించి నిజాయితీగా నోరు విప్పితే చాలు. ఆ ధైర్యం వారికి రావాలని మనసారా కోరుకుంటూ …అరుణాచలం