Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గుజరాత్ తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ సాగింది. 5గంటలలోపు క్యూలైన్లలోఉన్నవారికి పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన ఓటింగ్… సాయంత్రానికి పుంజుకుంది. ఐదుగంటల సమయానికి 65శాతంగా నమోదయింది. వెల్లువలా తరలివచ్చి ఓట్లు వేయాలని ప్రధాని మోడీ కోరినప్పటికీ గుజరాత్ వాసులు పెద్దగా స్పందించలేదు. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లోని మొత్తం 89 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 14న మిగిలిన 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
కాంగ్రెస్, బీజేపీ విస్తృత ప్రచారం నిర్వహించినప్పటికీ ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదు కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఎక్కువ ఓటింగ్ నమోదుకాకపోవడం కాంగ్రెస్ కు నష్టాన్ని, బీజేపీకి లాభాన్ని కలిగించే అవకాశం ఉంది. ఓటు వేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదంటే… ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేదని అర్ధం. ఇది బీజేపీకి లాభదాయకం కానుంది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడే ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటింగ్ లో పాల్గొంటారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షానికి లాభిస్తుంది. గుజరాత్ మొదటి విడత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించలేదు. అటు పలు సర్వేలు సైతం గుజరాత్ లో ఈ సారీ బీజేపీనీ అధికారంలోకి వస్తుందని వెల్లడిస్తున్నాయి. ఇదే నిజమైతే అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తుండగానే… రాహుల్ గాంధీని ఓటమి పలకరించినట్టు అవుతుంది. ఈ నెల 18న ఓట్ల లెక్కింపు జరగనుంది.