అనంతపురం మాజీ ఎమ్మెల్యే జి.గుర్నాథరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. ఆయన జనసేన వైపు మొగ్గుచూపుతారని విశ్లేషకుల విశ్లేషణలని తోసిపుచ్చుతూ ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం అక్కుపల్లి గ్రామం వద్ద వైసీపీ అధినేత జగన్ ను గురునాథ్‌రెడ్డి కలిశారు. ఆయన సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో జగన్ గుర్నాథ్ రెడ్డితో అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో గుర్నాథ్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి సాయంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒక్క జేసీ మినహా మిగతా టీడీపీ నేతలందరూ గుర్నాథ్ రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం గుర్నాథ్ రెడ్డి సీటు ఆశించటంలేదని చెప్పి పార్టీలో చేర్పించారు.
అయితే అనంత పార్టీ నేతలు ఎవరూ గుర్నాథ్ రెడ్డిని కలుపుకుని పోయే ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో పార్టీలో మనుగడ కష్టమని భావించిన గుర్నాథ్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తున్న జగన్ ఆధ్వర్యంలో వైసీపీతో కలిసి వెళ్తామని ఆయన పంచనే చేరి కండువా కప్పించుకున్నారు. కానీ గుర్నాథ్ రెడ్డి రాకను ఆ పార్టీ నేతలు స్వాగతిస్తారో లేదో అనే సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే ఆయన జగన్‌పై తీవ్ర విమర్శలు చేసి బయటకు వచ్చారు. అంతేకాకుండా రానున్న ఎన్నికలకు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి పేరు ఖరారు చేశారనే ప్రచారం జరీగ్న్ది. దీంతో రాజకీయాల్లో ఎన్ని తిట్టుకున్నా నాయకులంతా ఒకటే అని మరోసారి నిరూపించారని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.