ఎన్డీయే నుండి విడిపోయిన నాటి నుండి తెలుగుదేశం అంటేనే అంతెత్తున విరుచుకుపడుతున్న బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలుగు దేశం పార్టీపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ పాపాల చిట్టా తన దగ్గర ఉందని పార్లమెంట్ వేదికగా వాటిని బయటపెడతానని జీవీఎల్ ప్రకటించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో సభను అడ్డుకునే ప్రయత్నాలు టీడీపీ చేస్తోందని ధ్వజమెత్తారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏదో చేసేస్తాం అంటూ టీడీపీ ఎంపీలు విర్రవీగుతున్నారని కానీ టీడీపీ అంటేనే టోటల్ డ్రామా పార్టీ అని ఆయన కొత్త మీనింగ్ చెప్పారు. టీడీపీ ఏదో పొడిచేస్తాం అని విర్రవీగుతున్నారని వారి బెదిరింపులు తాటాకు చప్పుల్లేనని నరసింహారావు డిక్లేర్ చేశారు. ఎక్కడ అవకాశం దొరికినా టీడీపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని 3 నెలల నుంచి వీరి అబద్ధాలు, నాటకాలను ప్రజలకు చూపిస్తున్నామని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు తీసుకుంటూ అంతా తామే చేసినట్లు చెప్పుకోవడం టీడీపీకే చెల్లిందని, ఓవైపు స్పెషల్ ప్యాకేజీలను తీసుకుంటూనే మరోవైపు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఆయన అన్నారు. రెండేళ్ల క్రితం ఇదే డ్రామాల పార్టీ ప్యాకేజీ అద్భుతం అని పొగిడిందని ఎన్నికల నాటికి ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పుడు హోదా నాటకం తెరపైకి తీసుకొచ్చారని అన్నారు.
ప్రత్యేక హోదా కావాలంటూ దొంగ దీక్షలు చేస్తూ.. మరో వైపు ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇవ్వాలని ఉత్తరాలు రాస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. పటేల్ విగ్రహం ఏర్పాటు, దోలేరా విషయంలో ప్రజలకు తప్పుడు సమాచారంను చేరవేస్తున్నారని, ప్రజలు ఎన్నుకున్న పాపానికి 1500 రోజులుగా టీడీపీని భరిస్తున్నారని, పోలవరంకు వారం వారం వెళ్లి ఏమి సాధిస్తున్నారని జీవీఎల్ ప్రశ్నించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీపై డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. కడపకు స్టీల్ ప్లాంట్ రాకుండా అడ్డుకుంటున్నది తెలుగుదేశమేనని నరసింహారావు కుండబద్దలు కొట్టారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో 7 నెలల నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. సడన్గా దొంగ దీక్షలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు టీడీపీకి విశ్వసనీయత లేదన్నారు. కేవలం అవినీతి, అరాచకాలే టీడీపీకి కావాలని జీవీఎల్ ధ్వజమెత్తారు. ఆంధ్ర అభివృద్ధి కోసం వెనక్కు తిరిగి చూస్తే మోడీ కనిపిస్తున్నారు కానీ బాబు కనిపించడం లేదన్నారు. మళ్లీ తెలుగుదేశం గెలవడమనేది అసాధ్యమని జీవీఎల్ చెప్పుకొచ్చారు.