ఇజ్రాయెల్ – హమాస్‌ల మధ్య పోరు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్, గాజాలోని అల్-పిషా ఆస్పత్రిని హమాస్ తన ప్రధాన కమాండ్ సెంటర్‌గా వాడుకుంటోందని ఆరోపిస్తోంది. అందుకోసం బలమైన సాక్ష్యాలను ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. తాజాగా ఆ ఆస్పత్రిలో బందీలను దాచి పెట్టిన వీడియోను ఇజ్రాయెల్ డిఫన్స్ ఫోర్స్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ద్వారా బయటపెట్టింది.
అక్టోబరు 7వ తేదీన ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ హమాస్.. తమ దేశం నుంచి కొంతమందిని కిడ్నాప్ చేసి వారిని బందించేందుకు అల్-షిఫాకు తీసుకువెళ్లడం ఆ వీడియోలో క్లియర్‌గా కనిపిస్తోందని ఐడీఎఫ్లో తన ట్వీట్లో పేర్కొంది. అక్టోబరు 7న ఉదయం 10.42 నుంచి 11 గంటల మధ్య అల్-షిఫా ఆస్పత్రి సీసీటీవీ దృశ్యాలను విడుదల చేస్తూ.. ఆయుధాలతో ఉన్న హమాస్ ఉగ్రవాదులు ఓ వ్యక్తిని బలవంతంగా ఆస్పత్రి లోపలికి లాక్కెళ్లారని చెప్పింది. గాయపడిన మరో బందీని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నట్లుగా వీడియోలో రికార్డ్ అయ్యిందని పేర్కొంది. అయితే ఇప్పుడు వారంతా ప్రాణాలతోనే ఉన్నారా..? బతికే ఉంటే ఎక్కడ ఉన్నారన్నది తెలియడం లేదని పోస్టులో ఐడీఎఫ్ వ్యాఖ్యానించింది.