దాదాపు రెండు నెలలుగా కాల్పులు, రాకెట్ల మోతతో భీతావహంగా తయారైన పశ్చిమాసియాలో నిన్న చల్లటి కబురు వినిపించింది. హమాస్-ఇజ్రాయెల్ మధ్య సయోధ్య కుదిరి నాలుగు రోజులు యుద్ధానికి విరమణ ప్రకటించనున్నట్లు ప్రకటించాయి. తన చెరలో బందీగా ఉన్న 50 మందిని విడిచిపెట్టేందుకు హమాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. తమ జైళ్లలో ఉన్న 150 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడానికి ఇజ్రాయెల్ ఒప్పుకుంది. మరోవైపు గాజాపై దాడులకు 4 రోజుల పాటు బ్రేక్ ఇచ్చేందుకు అంగీకరించింది.
అయితే ఈ ఒప్పందం ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తుందని అంతా భావించారు. కానీ ఈ ఒప్పందం అమలుకు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఇజ్రాయెల్ భద్రత సలహాదారు షసి హేంజ్బి తెలిపారు. కానీ దానికి గల కారణాలు మాత్రం ఆయన వివరించలేదు. అయితే శుక్రవారం నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
యుద్ధం కారణంగా నెలకొన్ని సంక్షోభం తీవ్రతను తగ్గించేందుకు ఖతార్, అమెరికా, ఈజిప్టు దేశాలు ఇరుపక్షాలతో అనేక సంప్రదింపుల తర్వాత ఇజ్రాయెల్-హమాస్ మధ్య సయోధ్యను కుదర్చడంలో విజయం సాధించిన విషయం తెలిసిందే.