Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హిందీలో బాలనటిగా, తెలుగులో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి కోలీవుడ్ లో స్థిరపడిన ముంబై అమ్మాయి హన్సిక… అక్కడి ప్రేక్షకులకు ఆరాధ్యదేవతగా మారింది. కుష్బూ తర్వాత తమిళంలో ఆ స్థాయి అందుకున్న నాయిక హన్సికేనన్న పొగడ్తలూ వినిపించాయి. అలాగే కుష్భూలానే ఆమె కెరీర్ లో గాసిప్స్ కూ ఎక్కువ ప్రాముఖ్యతే ఉంది. శింబు, హన్సిక ప్రేమాయణంపై కోలీవుడ్ లో పెద్ద చర్చే నడిచింది. ఇక వారి పెళ్లే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఇద్దరూ ఆ బంధానికి గుడ్ బై చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శింబుతో పెళ్లి తర్వాత సినిమాలు మానేయడానికి హన్సిక నిరాకరించడం వల్లే ఈ వివాహం జరగలేదని ఇటీవలే శింబు తండ్రి రాజేందర్ చెప్పాడు.
శింబుతో ఎఫైర్ ముగిసిన తర్వాత హన్సిక పేరు జయం రవితో కలిసి వినిపించింది. వారిద్దరి ప్రేమ వ్యవహారం జయం రవి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, దీనిపై వారింట్లో గొడవ జరిగిందని కూడా వార్తలొచ్చాయి. అయితే ఈ విషయంపై హన్సిక ఎప్పుడూ నోరు మెదపలేదు. దీంతో ఆ పుకార్లకు తెరపడింది. ఆ తర్వాత హన్సిక సినిమాలపైనే దృష్టిపెట్టింది. తాజాగా ఇప్పుడు హన్సికపై మళ్లీ కోలీవుడ్ లో ఓ గాసిప్ హల్ చల్ చేస్తోంది. యంగ్ హీరో అధర్వతో హన్సిక ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. అయితే వారిద్దరూ ఇంతవరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. మరి వారికి పరిచయం ఎక్కడ కలిగింది… అది ప్రేమకు ఎలా దారితీసిందో ఎవరికీ తెలియడం లేదు కానీ ప్రస్తుతం కోలీవుడ్ మీడియా దృష్టంతా ఈ కొత్త ప్రేమజంట పైనే ఉంది.