Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఐపీఎల్ చాలా మంది క్రికెటర్ల జీవితాలను మార్చివేసింది. కెరీర్ పరంగానూ, ఆర్థికంగానూ ఐపీఎల్ ఎంతో మంది క్రికెటర్లకు కొత్త జీవితాన్నిచ్చింది. ఐపీఎల్ కు సెలెక్ట్ అయిన తర్వాత ఇల్లు, కార్లు, ఇతర అనేక విలాస వస్తువులును సొంతం చేసుకుంటున్నారు క్రికెటర్లు. వెలుగు జిలుగుల పొట్టి క్రికెట్ లో ప్రతిభ చూపించడం ద్వారా ఓ పక్క డబ్బులు వెనకేసుకుంటూనే మరో పక్క జట్టులోనూ స్థానం సంపాదించుకుంటున్నారు. భారత క్రికెట్లో ప్రస్తుతం వేగంగా ఎదుగుతున్న హార్దిక్ పాండ్యా కూడా ఆ కోవకే చెందుతాడు. జట్టులో కీలక బౌలర్ గా ఉన్న పాండ్యా అటు ఐపీఎల్ లోనూ, ఇటు భారత్ తరపునా ఆడుతూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇప్పడయితే పాండ్యా పరిస్థితి ఆర్థికంగా మెరుగయింది కానీ ఒకప్పుడు..అతనూ దేశంలోని మధ్యతరగతి కుటుంబాల్లా డబ్బు కోసం అనేక ఇబ్బందులు పడ్డవాడే. ఈ విషయాన్ని స్వయంగా పాండ్యానే చెప్పాడు. -ఐపీఎల్ కు ముందు కనీసం కారు ఈఎమ్ఐ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉండేవాడినని, 5, 10 రూపాయలు కూడా జాగ్రత్తగా దాచుకున్న రోజులు ఉన్నాయని ఆనాటి పరిస్థితుల్ని బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్ కార్యక్రమంలో గుర్తుచేసుకున్నాడు.
ఐపీఎల్ కు ఎంపికయ్యే మూడేళ్ల ముందు చాలా ఇబ్బందులు పడ్డానని పాండ్యా చెప్పాడు. కారు అంటే చాలా ఇష్టంఉండడంతో వాయిదాల పద్ధతిలో ఓ కారు కొనుక్కున్నానని, అయితే ఆ కారు నెలవారీ వాయిదాలు చెల్లించలేక రెండేళ్లపాటు దాన్ని రోడ్డుమీదకే తీసుకురాలేదని, ఈఎంఐలు కట్టేందుకు డబ్బులు కూడబెడుతూ ఉండేవాళ్లమని తెలిపాడు. తర్వాత ఐపీఎల్ లో సెలెక్ట్ కావడంతో ఆర్థికంగా దశ తిరిగిందని, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తరువాత రూ. 50 లక్షల చెక్కు అందుకున్నానని, అప్పుడు తన కారుకు విముక్తి లభించడంతో పాటు మరో కొత్త కారు కూడా కొనుక్కున్నానని పాండ్యా సంతోషం వ్యక్తంచేశాడు. మూడు నెలల కాలంలోనే తన జీవితం ఎంతో మారిపోయిందని తెలిపాడు. ఐపీఎల్ లో తన సహచర ఆటగాడైన వెస్టెండీస్ క్రికెటర్ పొలార్డ్ తో ఉన్న అనుబంధాన్ని కూడా పాండ్యా వివరించాడు. పొలార్డ్ ను తన సోదరుడిగా భావిస్తానని, తమ ఇద్దరిదీ ప్రత్యేక బంధమని పాండ్యా చెప్పాడు. విండీస్ లో వన్డే సిరీస్ ఆడేందుకు వెళ్లినప్పుడు జరిగిన ఓ సరదా సంఘటనను కూడా ప్రస్తావించాడు. తాను, పొలార్డ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా…తాను పొలార్డ్ తో నువ్వు పక్కనుంటే ఎలాంటి కష్టం కలగదని అన్నానని, కాసేపటికి ఓ పోలీసు తన దగ్గరకు వచ్చి అరెస్టు చేయబోయాడని, అయితే ఆ పోలీసు పొలార్డ్ స్నేహితుడని, తనను ఆట పట్టించడానికే అలా చేశాడని కాసేపటికే అర్ధమైందని పాండ్యా నవ్వుతూ చెప్పాడు. వచ్చిన పోలీసు ఫోన్ ను చెవి దగ్గర తలకిందులుగా పెట్టుకుని మాట్లాడుతుండడంతో విషయం తెలిసిపోయిందని ఆనాటి సంగతిని గుర్తుచేసుకున్నాడు.