సినీ నటుడు హరికృష్ణ మరణం నందమూరి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇప్పటికే వారు హరికృష్ణ కుమారుడు జానకి రాంను ఇదే విధంగా దూరం చేసుకుని బాధలో ఉంటె ఆ బాధ మరవక ముందే రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు టైగర్ లాంటి హరికృష్ణను కబళించింది. అయితే ఈ రోజు ఆయన అంత్యక్రియలు జుబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. హరికృష్ణ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ముందే నిర్ణయించింది. అయితే ఒక సెలెబ్రిటీలా కాకుండా తమ మనిషిలా, తమ సొంత మనిషిలా కలిసిపోయి ఎంతో మంది ఆప్తులను సంపాదించుకున్న హరికృష్ణను కడసారి చూసుకునేందుకు అభిమానులు భారీగా తరలి వస్తున్నారు.
నిన్నంతా వీఐపీలు వస్తూ, పోతూ ఉండటంతో సాధారణ కార్యకర్తలకు, అభిమానులకు హరికృష్ణ బౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించే అవకాశం దక్కలేదు. ఈ విషయాన్ని గ్రహించిన ఆయన కుటుంబ సభ్యులు అభిమానులకు హరికృష్ణను కడసారి చూసే అవకాశాన్ని కల్పించారు. అందుకోసం పోలీసుల ప్రత్యేక అనుమతితో ఈ ఉదయం 8 గంటల సమయం నుంచి మెహిదీపట్నంలోని ఆయన ఇంటివద్ద బారికేడ్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేసి, తోపులాటలు జరగకుండా అభిమానులను హరికృష్ణ ఇంటిలోనికి అనుమతిస్తున్నారు. ఈరోజు ఈ మధ్యాహ్నం 2 గంటలకు హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఈ విషయం మీద హైదరబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రకటన కూడా విడుదల చేసారు.