మంత్రి అఖిల ప్రియ పెళ్లి కళ తప్పింది, అవును తెలుగుదేశానికి మూలమైన నందమూరి ఫ్యామిలీలో కీలక వ్యక్తి మరణించడంతో నిన్నటి వరకు ఉన్న పెళ్లి సందడి లేకుండా పోయింది. వాస్తవానికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా ఆళ్లగడ్డలో ఉండాల్సింది. భూమా నాగిరెడ్డి మృతి తర్వాత జరుగుతున్న శుభకార్యం కావడం వలన భారీ ఎత్తున ప్లాన్ చేసింది భూమా కుటుంబం. అందుకే ఈ వేడుకకు తెలుగుదేశం పార్టీ ముఖ్యులందరినీ ఆహ్వానించింది మంత్రి అఖిలప్రియ.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా నారా, నందమూరి కుటుంబ సభ్యులున్నారు. అలాగే చంద్రబాబు కేబినెట్లోని మంత్రులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు అందరూ అఖిలప్రియ పెళ్లిలో ఉండాల్సింది. తెలుగుదేశం పార్టీ ఆళ్లగడ్డలో పెళ్లి సంబరాల్లో తేలాల్సిన ఉండాల్సిన సమయంలో హరికృష్ణ మరణం పార్టీ అంతటినీ విషాదంలోకి నెట్టింది. ప్రస్తుతం అందరూ ఆయనను చివరిసారి చూసుకునేందుకు హైదరాబాద్ చేరుకుంటున్నారు.