హోదా మాకు కూడా కావాలి !

ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఏ వస్తువుని అయినా చేరిసమానంగా ఇస్తుంది. ఒకవేళ తక్కువ ఉంటె అందులో చిన్నవాడికి, లేదా బలహీనం అనుకున్న వాడికి ఇస్తుంది. అప్పుడు రెండో వాడు నాకు కూడా కావాలని మారాం చేస్తాడు. ఇప్పుడు ఏపీ తెలంగాణాల పరిస్థితి అలానే ఉంది. ఏపీ తెలంగాణా విభజన జరిగింది, విభజన హామీల ప్రకారం ఏపీకి పదేళ్లు ప్రత్యేకహోదా అన్నారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తదో రాదో తెలీదు గాని, ఏపీకి ప్రత్యేకహోదా అనే మాట మాత్రం పదేళ్లు కాదు పాతికేళ్ళు ప్రజల నోటిలో నానేలా ఉంది. ప్రత్యేకహోదా అంశం ఏపీలోనే కాదు తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణలోనూ చర్చనీయాంశమైంది.

ఇప్పటికే హోదా విషయమై ఎన్డీయే నుండి బయటకు వచ్చిన టీడీపీ, ఇటీవల బిజేపిపై అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టింది. అయితే సరైన సభ్యుల మద్దతు లేక అది వీగిపోయియింది ఇక నేడు హోదా కోసం ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి బంద్ కూడా చేపట్టింది. ఇక పోతే రాష్ట్రానికి సంజీవని వంటి హోదాని టీడీపీ మొదటి నుండి తొక్కి పట్టి ఇప్పుడు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం ఎన్నికలు దగ్గర పడుతున్నాయని అడుగుతోందని, అంతా అయిపోయాక ఇప్పుడు పార్లమెంట్ లో గొంతు చించుకుని అరిచినప్పటికీ కూడా ఎటువంటి ఉపయోగం ఉండదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదే అంశం మీద తెలంగాణా మంత్రి హరీష్ రావుని కదిలిస్తే మరో కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే, తెలంగాణకు కూడా ఇవ్వాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే, పరిశ్రమలన్నీ అక్కడకు తరలిపోతాయని, తెలంగాణ ప్రజలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాకు తాము వ్యతిరేకం కాదని… వారికి హోదా ఇచ్చినప్పుడు తమకు కూడా ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామని అన్నారు.