తెలంగాణ మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంపై ఎలాంటి అసంతృప్తి లేదని హరీశ్‌రావు ప్రకటించారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను పాటించడమే తన విధి అని, తనకు మంత్రి దక్కకపోవడంపై ఎలాంటి రాద్ధాతం చేయాల్సిన అవసరం లేదని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయొద్దని తన పేరిట ఎలాంటి గ్రూపులు, సేనలు లేవని స్పష్టం చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణగా మారుతోందన్నారు.
కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను మంత్రులు పూర్తిస్థాయిలో నెరవేర్చి ప్రజల ఆకాంక్షలను తీర్చాలని సూచించారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవటం ఇదే మొదటిసారి అన్న ప్రశ్నకు కూడా ఆయన స్పందించారు. పార్టీ అవసరాలకు అనుగుణంగా మంత్రి పదవులు ఉంటాయని ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎలా వినియోగించుకుని పార్టీని బలపేతం చేయాలో కేసీఆర్ కు తెలుసని ఆయన అన్నారు. కొందరు కావాలనే సేనలు క్రియేట్ చేసి మరీ తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారాయన.