కనీవినీ ఎరుగని రీతిలో ఎవరికీ సాధ్యంకాని గెలుపుని హరీశ్ రావు సాధించారు. లక్ష ఓట్ల మెజార్టీతో విజయదుందుభి మోగించారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి హరీశ్ 1,06,816 ఓట్ల మెజార్టీ సాధించి తెలంగాణ ఎన్నికల్లో సరికొత్త రికార్డు సృష్టించారు. సమీప ప్రత్యర్థి, టీజేఎస్ అభ్యర్థి మరికంటి భవానీ రెడ్డి ఆయనకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. 2004 ఉపఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యే అయిన హరీశ్ రావ ఆ తర్వాత నుంచి వరస విజయాలు సాధిస్తున్నారు. 2008, 2010 ఉపఎన్నికలతో పాటు 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గెలుస్తూ వచ్చారు. తాజా ఎన్నికల్లో గెలుపుతో ఆయన డబుల్ హ్యాట్రిక్ సాధించినట్లైంది. అంతేకాకుండా ఎన్నిక ఎన్నికకు హరీశ్ తన మెజార్టీని పెంచుకోవడం మరో విశేషం. హరీష్ పుణ్యమా అంటూ టీఆర్‌ఎస్ పార్టీకి సిద్దిపేట కంచుకోటగా మారింది. పోలైన ఓట్లలో 80 శాతానికి పైగా ఓట్లు హరీశ్ రావు దక్కించుకోవడం గమనార్హం.